ఆదిలాబాద్‌లో పత్తి క్వింటాలుకు రికార్డు స్థాయిలో రూ.9,260.. కనీస మద్దతు ధర రూ.8,667 కంటే ఎక్కువ!

తెలంగాణలో పత్తి ధర రికార్డులు సృష్టిస్తోంది. కనీస మద్దతు ధర దాటి పలుకుతోంది. డిమాండ్ ఎక్కువ ఉండటంతో వ్యాపారులు మంచి ధర పెడుతున్నారు.

Published on: Oct 23, 2026, 07:14:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొదటి రోజే ప్రైవేటు వ్యాపారులు క్వింటాలు పత్తికి రికార్డు స్థాయిలో రూ.9,260 ధర చెల్లించారు. ఇది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) క్వింటాలుకు రూ.8,667 కంటే ఎక్కువ. ఈ పత్తిలో తేమ శాతం 8శాతంగా ఉంది.

పత్తి ధర
పత్తి ధర

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమైన మొదటి రోజున నమోదైన అత్యధిక ధర ఇదే కావచ్చు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మార్కెట్ యార్డును పరిశీలించి, వ్యాపార లావాదేవీలు సజావుగా సాగేందుకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు. రైతులు తమ పత్తిని సులభంగా అమ్ముకునేందుకు వీలుగా జిల్లావ్యాప్తంగా 33 జిన్నింగ్ మిల్లులను, 18 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులకు తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించారు. అలాగే వారికి ప్రయోజనం చేకూర్చేలా రూపాయికే భోజనం పథకాన్ని కూడా అందుబాటులో ఉంచారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా పత్తి ఏరే పని కొనసాగుతుండటంతో, రాబోయే రోజుల్లో వ్యాపార కార్యకలాపాలు మరింత ఊపందుకోనున్నాయి.

రాష్ట్రంలో 2026-27 సీజన్‌కు గాను మద్దతు ధరతో పత్తి సేకరణ ప్రక్రియను కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) అధికారికంగా వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతగా 157 కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సీసీఐ కేంద్రాల్లో పంటను విక్రయించేందుకు మొదటిరోజే 8,205 మంది రైతులు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకున్నారు.

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో పత్తికి మంచి ధర లభిస్తుండటంతో, ప్రారంభ రోజున సీసీఐ కేంద్రాలకు రైతుల రాక కొంత తక్కువగానే నమోదైంది. మరిన్ని కొనుగోలు కేంద్రాలను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 356 జిన్నింగ్ మిల్లులు అందుబాటులో ఉండగా, ప్రభుత్వం ఇప్పటివరకు 30 జిల్లాల పరిధిలోని 335 జిన్నింగ్ మిల్లులను సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 48.20 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. ఎల్-నినో ప్రభావం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఈసారి పత్తి దిగుబడి తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరగడంతో ప్రైవేటు వ్యాపారులు పోటీపడి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఓపెన్ మార్కెట్‌లో మద్దతు ధర కంటే ఎక్కువ రేటు లభిస్తుండటంతో రైతులు కూడా ప్రైవేట్ వ్యాపారులకే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More