పత్తి కొనుగోళ్లపై సీసీఐ నుంచి రైతులకు కీలక అప్డేట్.. ఈ నెలాఖరు వరకు ఛాన్స్!

పత్తి రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) గుడ్‌న్యూస్ చెప్పింది. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ నెలాఖరు దాకా పత్తిని కొనుగోలు చేయనుంది.

Published on: Feb 22, 2026, 14:16:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పత్తి కొనుగోళ్లపై సీసీఐ అన్నదాతలకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రైతన్నల దగ్గర నిల్వ ఉన్న, లేట్‌ క్రాప్ ద్వారా సేకరిస్తున్న పత్తిని కొనుగోళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇప్పటికే సీసీఐ కేంద్రాలు మూతపడాల్సి ఉండగా.. రైతుల కోసం పొడిగించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు ఈ నెలాఖరు వరకు పత్తి సేకరణను కొనసాగించాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నిర్ణయించింది.

పత్తి కొనుగోళ్లపై అప్డేట్
పత్తి కొనుగోళ్లపై అప్డేట్

వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకారం సీసీఐ ఇప్పటివరకు 8.8 లక్షలకు పైగా రైతుల నుండి రూ.12,823 కోట్ల విలువైన 16.15 లక్షల టన్నుల పత్తిని కొనుగోలు చేసింది. కొన్ని ప్రాంతాల్లో పత్తి ఇంకా తీస్తున్నందున సేకరణ తేదీని పొడిగించాలని కోరుతూ కేంద్ర జౌళి మంత్రి, సీసీఐ, రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌కు లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు.

పత్తి అమ్మకానికి పొడిగించిన గడువును ఉపయోగించుకోవాలని, నాణ్యత నిబంధనలను అనుసరించడం ద్వారా క్వింటాలుకు రూ.8,110 కనీస మద్దతు ధరకు సీసీఐకి తమ ఉత్పత్తులను విక్రయించాలని రైతులను తుమ్మల కోరారు. మార్కెట్లో రైతుల నుండి 2.24 లక్షల టన్నుల తక్కువ నాణ్యత గల పత్తిని కూడా కొనుగోలు చేశామని, మరో 9.99 లక్షల టన్నుల పత్తి నిల్వలు ఇప్పటికీ రైతుల వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

రైతు సంఘాలు, జిన్నింగ్ మిల్లుల నుండి వివరాలను నమోదు చేయడానికి ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ పట్ల కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించి, యాప్‌ను ఉపయోగించుకునేలా చేసిందన్నారు మంత్రి తుమ్మల. యాప్‌లో ఉత్పత్తుల(పత్తి) వివరాలను బుక్ చేసుకోవడం వల్ల రైతులు నిర్ణీత/నిర్దేశిత సమయంలో కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు క్యూలలో పత్తిని ఉంచకుండా ఉండటానికి వీలు కల్పిస్తుందని మంత్రి చెప్పారు.

ఇప్పుడు సీసీఐ సమయం పొడిగించడంతో రైతులు తమ ఉత్పత్తులన్నింటినీ అమ్ముకోవచ్చు. వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం, 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 50.7 లక్షల ఎకరాల్లో పత్తిని పండించారు, కానీ 45.32 లక్షల ఎకరాల్లో మాత్రమే సురక్షితంగా ఉంది. ఎందుకంటే మిగిలిన విస్తీర్ణంలో పంట భారీ వర్షాలు, వరదలలో తీవ్రంగా దెబ్బతింది. 45.32 లక్షల ఎకరాల్లో పత్తి ఉత్పత్తి 28.29 లక్షల టన్నులుగా అంచనా వేశారు అధికారులు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More