'విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపండి' - ఏపీ సీఎంతో మంత్రి తుమ్మల భేటీ, కీలకాంశాలపై చర్చ..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రి తుమ్మల సోమవారం భేటీ అయ్యారు.తిరుమలలో తెలంగాణ రాష్టానికి 5 ఎకరాల స్థలం కేటాయింపునకు విజ్ఞప్తి చేశారు. విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపేందుకు సహకరించాలని కోరారు.

Published on: Feb 17, 2026 6:49 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంతో పరిష్కరించాల్సిన పలు అంశాలను భేటీలో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్లు వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ది జరుగుతుందని తుమ్మల అభిప్రాయపడ్డారు. వీటికి సంబంధించిన పలు వివరాలను ముఖ్యమంత్రికి ఆయన తెలియచేశారు. రెండు ప్రభుత్వాలు ఉన్నత స్థాయిలో సంప్రదింపుల ద్వారా ఈ సమస్యల పరిష్కారం జరుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల
ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల

విలీన గ్రామాల విజ్ఞప్తి…

రాష్ట్ర పునర్విభనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అయిదు గ్రామపంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల వివరించారు. యేటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామపంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉన్నాయన్నారు. ప్రజలు పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ గ్రామాలు గోదావరి నది, అటవీ ప్రాంతాల మధ్య ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంక్లేవ్‌లా మారిపోయాయని… జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రజలు దాదాపు 8 గంటలు ప్రయాణించాల్సి వస్తోందని మంత్రి పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, పన్నులు, పరిపాలనా అనుసంధానం లోపం, భద్రతా సమస్యలు వంటి అంశాలు స్థానిక గిరిజన ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని వివరించారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబంధించిన భూభాగాల్లో కొంత భాగం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటం వల్ల దేవస్థానం పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించాలంటే ఈ గ్రామాల విలీనం అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ చర్య కీలకమని తెలిపారు.

ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు సాగునీటి ప్రాజెక్ట్ శాశ్వత మరమ్మత్తులు అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 16,000 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, అందులో సుమారు 13,640 ఎకరాలు (85.25%) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 2,360 ఎకరాలు (14.75%) తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అని తెలిపారు. ప్రాజెక్ట్ శాశ్వత పునరుద్ధరణకు సుమారు రూ.92.20 కోట్ల వ్యయం అంచనా వేయబడిందన్నారు. రెండు రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఖర్చును 85:15 నిష్పత్తిలో భరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరి వరద రక్షణ కరకట్టలోని 3వ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతిన్న విషయం కూడా మంత్రి ప్రస్తావించారు. భద్రాచలం పట్టణాన్ని వరదల నుంచి రక్షించేందుకు నిర్మించిన ఈ రక్షణ గోడలో జరిగిన ఈ నష్టం భవిష్యత్తులో భారీ ప్రమాదానికి దారితీయొచ్చని పేర్కొన్నారు. కరకట్టలోని ఆ భాగం విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లడంతో నిర్వహణలో సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు.

ఖమ్మం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి అవసరమైన భూమి గుర్తింపు పూర్తైందని మంత్రి తుమ్మల వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పనులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి కోరారు. స్థానిక భక్తుల దీర్ఘకాలిక ఆశయాన్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

5 ఎకరాల భూమిని కేటాయించండి - మంత్రి తుమ్మల

తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం ప్రత్యేక యాత్రికుల భవనం నిర్మాణానికి సుమారు 5 ఎకరాల భూమి కేటాయించాలని మంత్రి తుమ్మల ప్రతిపాదించారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వసతి కొరతను తగ్గించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శన అనుభవం కల్పించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని తెలిపారు.సత్తుపల్లి కొవ్వూరు రైల్వే లైన్, పెనుబల్లి అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More