Stipend hike : పోటీ పరీక్షల అభ్యర్థులకు గుడ్ న్యూస్ - స్టైపెండ్ పెంచిన తెలంగాణ సర్కార్, బుక్ ఫండ్ డబుల్!

Telangana BC Study Circle stipend hike : తెలంగాణలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల స్టైపెండ్‌ను  ప్రభుత్వం పెంచింది. సివిల్స్ అభ్యర్థులకు రూ.7,000, బుక్ ఫండ్ రూ.10,000తో పాటు పూర్వ విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ సౌకర్యాన్ని కల్పించింది.

Published on: Nov 6, 2026, 21:26:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Telangana BC Study Circle stipend hike : నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మరింత ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల నెలవారీ స్టైపెండ్‌ను, వార్షిక బుక్ ఫండ్ మొత్తాన్ని భారీగా పెంచుతున్నట్లు వెల్లడించింది.

స్టైపెండ్ పెంచిన తెలంగాణ సర్కార్
స్టైపెండ్ పెంచిన తెలంగాణ సర్కార్

నిరుద్యోగ యువతపై ఆర్థిక భారాన్ని తగ్గించి, వారు పూర్తి స్థాయిలో పరీక్షల ప్రిపరేషన్‌పైనే దృష్టి పెట్టేలా ఈ సదుపాయాలు పెంచినట్లు తెలిపింది. పెంచిన ఈ కొత్త స్టైపెండ్ సదుపాయం ఈ నవంబర్ నెల నుంచే తక్షణమే అమల్లోకి వస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

స్టైపెండ్ - బుక్ ఫండ్ వివరాలు:

  • యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్‌కు ఎంపికైన విద్యార్థుల నెలవారీ స్టైపెండ్‌ను గతంలో ఉన్న రూ.5,000 నుంచి రూ.7,000కు పెంచారు.
  • సివిల్స్ అభ్యర్థులకు ప్రతి ఏటా పుస్తకాల కొనుగోలు కోసం ఇచ్చే బుక్ ఫండ్‌ను రూ.5,000 నుంచి రూ.10,000కు రెట్టింపు చేశారు.
  • టీజీపీఎస్సీ (TGPSC) నిర్వహించే గ్రూప్-1, 2, 3, 4 పరీక్షలతో పాటు బ్యాంకింగ్, రైల్వే రిక్రూట్‌మెంట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పోటీ పరీక్షలకు ఫౌండేషన్ కోర్సులో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల నెలవారీ స్టైపెండ్‌ను రూ.1,000 నుంచి రూ.1,500కు పెంచారు.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వంటి కఠినమైన పరీక్షల్లో విజయం సాధించాలంటే నిరంతర అధ్యయనం, సుదీర్ఘ ప్రిపరేషన్ అవసరమవుతాయి. విద్యార్థుల అవసరాలను గుర్తించిన ప్రభుత్వం….. బీసీ స్టడీ సర్కిల్ చరిత్రలోనే తొలిసారిగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లలో ఇక్కడ సివిల్స్ కోచింగ్ తీసుకున్న పూర్వ విద్యార్థులకు కూడా పునఃప్రవేశం (రీ-అడ్మిషన్) కల్పించాలని నిర్ణయించింది.

యూపీఎస్సీ నమూనాలోనే ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి ప్రతిభావంతులైన పూర్వ విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి కూడా ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో సమానంగా నెలవారీ స్టైపెండ్ మరియు ఇతర సౌకర్యాలు లభిస్తాయి. దీనివల్ల పేద, బలహీన వర్గాలకు చెందిన యువతకు అనుభవజ్ఞులైన మెంటార్లతో పాటు ఆర్థిక వెసులుబాటు కూడా లభిస్తుంది.

బీసీ స్టడీ సర్కిళ్లలో విద్యా ప్రమాణాలు పెంచడం, అభ్యర్థులు సివిల్స్ సాధించేలా తీర్చిదిద్దడంపై ఇటీవల నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే స్టైపెండ్ పెంపు నిర్ణయాన్ని తక్షణమే అమలుల్లోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కమిటీ చేసిన ఇతర కీలక సూచనలను కూడా అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు.

డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు:

పోటీ పరీక్షల విద్యార్థులకు తరగతి గదులతో పాటు చుట్టూ ఉన్న వాతావరణం కూడా అధ్యయనానికి ఉపయోగపడేలా సరికొత్త మార్పులు చేస్తున్నారు. ప్రతి బీసీ స్టడీ సర్కిల్ భవనం గోడలు, మెట్లపై పోటీ పరీక్షలకు ఉపయోగపడే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ (భారత రాజ్యాంగం), ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను అందమైన మ్యాప్‌లు, గ్రాఫ్‌లు, పెయింటింగ్‌ల రూపంలో తీర్చిదిద్దుతున్నారు.

హైదరాబాద్ బీసీ స్టడీ సర్కిల్‌లో ఇప్పటికే ప్రారంభించిన ఈ పద్ధతి అభ్యర్థులకు విశ్రాంతి సమయంలో కూడా క్విక్ రివిజన్‌లా ఉపయోగపడుతోంది. దీనిని రాష్ట్రంలోని మిగిలిన అన్ని కేంద్రాల్లోనూ అమలు చేయనున్నారు. అంతేకాకుండా, సొంత భవనాలు ఉన్న ప్రతి కేంద్రంలో ప్రత్యేక స్టడీ రూమ్‌లు, డిజిటల్ లైబ్రరీలను అత్యంత వేగంగా అందుబాటులోకి తేనున్నారు. నిరుద్యోగ యువత ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాల ఆశయాలను నెరవేర్చుకోవాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More