ఇందిరమ్మ పథకం పేరుతో మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : సజ్జనార్ ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసం చేసేవారి పట్ల జాగ్రత్త వహించాలని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు.

Published on: Jul 26, 2026, 16:00:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ల కేటాయింపు పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ హెచ్చరించారు. లబ్ధిదారుల నుండి రూ.10,000 ముందస్తు డిపాజిట్ చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైన దృష్ట్యా సైబర్ నేరగాళ్లు నకిలీ ఫోన్ కాల్స్, గుర్తుతెలియని లింకుల ద్వారా ప్రజలను బురిడీ కొట్టించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్ సీపీ సజ్జనార్
హైదరాబాద్ సీపీ సజ్జనార్

పథకంలో దళారులు లేదా మధ్యవర్తులకు ఎలాంటి తావులేదని, ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని సీపీ తెలిపారు. నిబంధనల ప్రకారం లబ్ధిదారులు చెల్లించే ఈఎమ్‌డీ సొమ్ము సురక్షితంగా ఉంటుందన్నారు. ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే ప్రభుత్వం ఆ మొత్తాన్ని నేరుగా దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాకే తిరిగి జమ చేస్తుందని వివరించారు.

డబ్బులు ఇస్తే కచ్చితంగా ఇల్లు ఇప్పిస్తాం అని నమ్మబలికే వారి మాటలను అస్సలు నమ్మవద్దని సీపీ సజ్జనార్ సూచించారు. ఈ రోజే ఆఖరి తేదీ, వెంటనే డబ్బులు చెల్లించకపోతే ఇల్లు రద్దవుతుంది అంటూ భయాందోళనలకు గురిచేసి, తొందరపాటుతో డబ్బులు బదిలీ చేయించడమే మోసగాళ్ల ప్రధాన వ్యూహమని హెచ్చరించారు.

వాట్సాప్ లేదా మెసేజ్‌ల ద్వారా వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయడం, ఏపీకే (APK) ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఫోన్లు హ్యాక్ అయి, బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని కమిషనర్ హెచ్చరించారు. అధికారిక ప్రభుత్వ పోర్టళ్లను పోలిన నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి కూడా నేరగాళ్లు మోసం చేయవచ్చని తెలిపారు. సహాయం చేస్తున్నామనే పేరుతో ఎనీడెస్క్ లేదా టీమ్‌వ్యూయర్ వంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయించి బ్యాంకు వివరాలను దొంగిలిస్తారని పేర్కొన్నారు.

డబ్బులు చెల్లించడానికి మాత్రమే యూపీఐ పిన్ అవసరమవుతుందని, రిఫండ్ పొందడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని లబ్ధిదారులు గుర్తుంచుకోవాలన్నారు సజ్జనార్. వ్యక్తిగత గుర్తింపు కార్డులు, బ్యాంకు వివరాలు లేదా ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం 040-24603572 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేసి పొగొట్టుకున్న సొమ్మును వెంటనే ఫ్రీజ్ చేయించుకోవాలని సీపీ సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More