టైర్ 2, 3 సిటీల్లోనూ ఐటీ, ఇతర ఉద్యోగ అవకాశాలు.. ప్రభుత్వం సరికొత్త ప్లాన్

ఐటీ, ఇతర ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసేలా సంస్థలకు ప్రోత్సహకాలు ఇవ్వాలన్నారు.

Published on: May 20, 2026, 20:13:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC) ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థల నుంచి పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ మహానగరానికే పరిమితం కాకుండా జిల్లాలకు కూడా విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ అవతలి ప్రాంతంలో కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా జీసీసీ పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసేలా ఆయా సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఐటీ, పరిశ్రమల శాఖ సంబంధిత అంశాలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఐటీ, ఇతర ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “బియాండ్ క్యూర్" (కోర్ అర్బన్ రీజియన్ అవతలి) ప్రాంతాలను గుర్తించి అక్కడ ఐటీ, డేటా సెంటర్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐటీ విస్తరణ పెద్దగా లేని చోట్ల కూడా డేటా సెంటర్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు పర్యావరణహిత నెట్-జీరో విధానాలను తప్పనిసరిగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన ఐదు ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాల్లో ఒకటి ఫ్యూచర్ సిటీలో అంతర్భాగమైన హెల్త్ సిటీలో ఏర్పాటయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆదేశించారు. అవసరమైతే ప్రధానమంత్రితో స్వయంగా మాట్లాడుతానని ముఖ్యమంత్రి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదిత ఏఐ సిటీ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రపంచంలోనే గొప్ప సదుపాయాలు ఉండేలా ఏఐ సిటీ నిర్మాణం ఉండాలన్నారు.

ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రీయల్‌లో వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రాంగణాల్లో శంకుస్థాపనలకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు రేవంత్ రెడ్డి. అక్కడ స్థాపించే కంపెనీలన్నీ నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలని అన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులను మరింతగా ప్రోత్సహించే డైనమిక్ ఏజెన్సీగా, ఇన్వెస్టర్లకు ఎండ్-టు-ఎండ్ సేవలు అందించే వ్యవస్థగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో ఐటీ, పరిశ్రమల శాఖల అధికారులతో పాటు ఇంధన, ఆర్థిక శాఖల సీనియర్ అధికారులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాలన్నారు.

పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ చేరుకున్నప్పటి నుంచి కార్యకలాపాల ప్రారంభం అయ్యే వరకు ఆయా సంస్థల అవసరాలన్నింటినీ సమన్వయం చేసేందుకు ప్రత్యేక ఎస్కార్ట్ ఆఫీసర్‌ను కేటాయించాలని రేవంత్ చెప్పారు. మూడు నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ ఆపరేటర్లకు బదులుగా టి-ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఆరు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టి-ఫైబర్‌కు మారడం ద్వారా రూ.54 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చినట్లు అధికారులు ముఖ్యమంత్రి వివరించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, టీజీఐఐసీ వీసీ అండ్ ఎండీ కె.శశాంక, ఐటీ అండ్ సీ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, పరిశ్రమల శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More