ఐటీలో తెలంగాణ మేటి.. ప్రభుత్వ విజన్‌తో ఐటీ హబ్‌గా హైదరాబాద్!
ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోంది. భాగ్యనగరం ఐటీ రంగానికి కేరాఫ్‌గా మారుతోంది. సంవత్సరానికి రూ. 3 లక్షల కోట్లకు పైగా ఐటీ ఎగుమతులు అవుతున్నట్టుగా గణంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఐటీ రంగంపై పరిశోధకురాలు జీ.లక్ష్మీదేవి అందిస్తున్న సమాచారం మీకోసం..
తెలంగాణ ఐటీ రంగం వేగంగా దూసుకుపోతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఐటీ రంగానికి కేరాఫ్‌గా మారడంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతిక రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి సఫలమవుతోంది. తెలంగాణ సంవత్సరానికి రూ.3 లక్షల కోట్లకు పైగా ఐటీ ఎగుమతులు చేస్తోందని గణంకాలు చెప్తే... అదేంటో, ఎలా జరుగుతుందో అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు. కానీ ఆ గణాంకాల వెనుక ఒక మనిషి జీవితం ఉంటుంది. ఒక కొత్త ఉద్యోగం, ఒక కొత్త ఇల్లు, ఒక కుటుంబానికి భరోసా... ఇవన్నీ సంఖ్యలుగా కనిపించే ఐటీ ఎగుమతులు, పెట్టుబడులు, వృద్ధి శాతాల వెనుక దాగి ఉన్న నిజమైన లెక్కలు! గత రెండేళ్లుగా తెలంగాణ ఐటీ రంగం వేగంగా ముందుకు సాగుతున్న తీరుకు ఇవి సాక్ష్యాలు! ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ జయకేతనం కాదు, ఇది మారుతున్న ప్రపంచానికి సరిపోయేలా ఒక రాష్ట్రం తన భవిష్యత్తును ఎలా మలుచుకుంటుందో చూపించే ప్రయాణం.

ఈజ్ ఆఫ్ గ్రోత్
2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐటీ రంగాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన గ్రోత్ ఇంజన్‌గా మార్చాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దిశగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేపట్టిన అంతర్జాతీయ స్థాయి ప్రచారం, పెట్టుబడుల ఆకర్షణ, విధాన సంస్కరణలు తెలంగాణ ఐటీ ఎకో సిస్టమ్‌ను మరో మెట్టుకు తీసుకెళ్లాయి. పరిశ్రమల నుంచి నేరుగా నిపుణులను తీసుకొని విధానాలు రూపొందించడం, గ్లోబల్ కంపెనీలతో నిరంతర చర్చలు కొనసాగించడం వల్ల రాష్ట్రం ఇప్పుడు పెట్టుబడిదారులకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మాత్రమే కాదు, ‘ఈజ్ ఆఫ్ గ్రోత్’ అందించే గమ్యంగానూ మారింది.
40 శాతం పైగా వృద్ధి
ప్రభుత్వ ప్రయత్నాల ఫలితమే 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3.60 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు, 11 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించగలిగింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఐటీ రంగంలో దాదాపు 40 శాతం పైగా వృద్ధి నమోదైంది. ఇది జాతీయ సగటును మించడాన్ని గమనిస్తే, రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలు ఆకాశంలో గీతలు కాదు, నేలమీద పెట్టిన పాదచిహ్నాలనే నిజాన్ని చాటుతున్నాయి. 2023లో తెలంగాణ వ్యాప్తంగా 9.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, 2024-25 నాటికి అది 10.2 లక్షలకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అది 11 లక్షల మార్క్ ని దాటే దిశగా దూసుకెళ్తోంది. ఐటీ రంగంలో అభివృద్ధి సామాజిక భద్రతకూ, మధ్యతరగతి విస్తరణకూ ఎంత కీలకం. అంతేకాదు, ఐటీ ఎదుగుదలతో హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, రవాణా, సేవా రంగాల్లో మరో 25 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
దావోస్‌లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం
ప్రపంచ వేదికలపై తెలంగాణకు పెరుగుతున్న గుర్తింపు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ నెల 19న దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమావేశాలకు వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరోసారి తెలంగాణలో ఉన్న వనరులను, అవకాశాలను ప్రపంచానికి వివరించబోతున్నారు. రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఉంచేందుకు... అక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) కోసం హైదరాబాద్‌ను హబ్‌గా ప్రచారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రపంచంలో టాప్-3 జీసీసీ డెస్టినేషన్లలో ఒకటిగా ఉన్న హైదరాబాద్‌లో 300కు పైగా జీసీసీలు ఉన్నాయి. అంటే మొత్తంగా 70 శాతం ఇక్కడే ఉండటం తెలంగాణ ఐటీ ఎకో సిస్టమ్ బలాన్ని సూచిస్తుంది. యూరోప్, అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా కంపెనీలతో ముఖాముఖి సమావేశాలు జరుపుతూ ప్రత్యేక పాలసీలు, ప్రోత్సాహకాలపై ప్రజెంటేషన్లు ఇస్తూ మంత్రి శ్రీధర్ బాబు కొత్త జీసీసీలకు, పెట్టుబడులకు తలుపులు తెరుస్తున్నారు.
సరికొత్త అధ్యాయం
డేటా సెంటర్ల రంగంలోనూ తెలంగాణ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్‌లో ఇన్‌ఫ్రాకీ డీసీ పార్క్ నుంచి రూ.70 వేల కోట్లు, జేసీకే ఇన్ఫ్రా నుంచి రూ.9 వేల కోట్లు, ఏజీపీ గ్రూప్ నుంచి రూ.6,750 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. ఈ పెట్టుబడులతో 10 వేల ఉద్యోగాలు రానున్నాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఈ డేటా సెంటర్లు తెలంగాణను దక్షిణాసియాలో కీలక డేటా హబ్‌గా నిలబెట్టే శక్తి కలిగి ఉన్నాయి. భవిష్యత్ నగరంగా రూపొందుతున్న భారత్ ఫ్యూచర్ సిటీలో బ్రూక్‌ఫీల్డ్-యాక్సిస్ వెంచర్స్ కూటమి రూ.75 వేల కోట్లతో గ్లోబల్ ఆర్ అండ్ డీ, డీప్‌టెక్ హబ్ ఏర్పాటు చేయనుండటం, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ రూ.41 వేల కోట్లతో హైదరాబాద్‌లో స్మార్ట్ టెక్నాలజీ, డిజిటల్ మీడియా కేంద్రాన్ని ప్రతిపాదించింది. ఇవి తెలంగాణ ‘రైజింగ్ 2047’ లక్ష్యానికి బలమైన పునాదులుగా మారనున్నాయి.
ఏఐలోనూ హైదరాబాద్
కృత్రిమ మేథలోనూ (ఏఐ) దేశంలోనే వేగంగా ఎదుగుతున్న నగరంగా హైదరాబాద్ మారుతోంది. ప్రిన్స్‌టన్ కేంద్రంగా పనిచేసే ఎయిడెన్ ఏఐ ఇంజినీరింగ్ సెంటర్ విస్తరణతో మరో 500 ఉద్యోగాలు రానుండటం, ఇప్పటికే ఉన్న 500 మంది నిపుణులతో కలిపి వెయ్యి మందికి పైగా హై-స్కిల్ టాలెంట్ ఇక్కడ చేస్తున్నారు. హైదరాబాదును ఐటీతో పాటు ఏఐ ఆవిష్కరణల కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం అనుకూలమైన వాతావరణం కల్పించింది. ఈ భారీ పెట్టుబడులు ‘‘తెలంగాణ రైజింగ్ 2047’’ లక్ష్యానికి బలమైన పునాదులు వేస్తున్నాయి. లైఫ్ సైన్సెస్, బయోటెక్ రంగాల్లోనూ తెలంగాణ తనదైన ముద్ర వేస్తోంది.
ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు జరగనున్న బయో ఆసియా సదస్సు ‘టెక్‌బయో అన్‌లాస్‌డ్ థీమ్‌తో ఏఐ, ఆటోమేషన్, బయాలజీ సంగమాన్ని ప్రపంచానికి చూపించనుంది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్బయోటెక్ కాన్ఫరెన్స్‌లో 2030 నాటికి బయోటెక్ రంగంలో లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించే ప్రణాళికలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఆస్ట్రేలియా కౌన్సిల్ జనరల్ ఆహ్వానంతో ఈ సమావేంలో పాల్గొని మన దేశం నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక మంత్రిగా చరిత్ర సృష్టించారు. తెలంగాణ అంతర్జాతీయంగా సంపాదించుకున్న విశ్వాసానికి ఇదొక సంకేతంగా చూడవచ్చు.
క్రియేటివ్ ఎకానమీపై కూడా
కేవలం సాంప్రదాయ ఐటీకి పరిమితం కాకుండా, క్రియేటివ్ ఎకానమీపై కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇమేజ్ 2.0 పాలసీ ద్వారా యానిమేషన్, గేమింగ్, మల్టీమీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు ప్రోత్సాహం ఇచ్చి యువత ప్రతిభను ప్రపంచ మార్కెట్‌కు తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం మోడళ్లకు అనుకూల మౌలిక వసతులు, రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ కనెక్టివిటీ పెంపుతో సమతుల్య అభివృద్ధి లక్ష్యం ముందుకు సాగుతోంది. ఈ ప్రయత్నాలకు, శ్రమకు ఫలితమే పెట్టుబడిదారుల విశ్వాసం. దేశీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం, విభిన్న రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకోవడం రాష్ట్ర విధానాల స్థిరత్వాన్ని కొలుస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి మాత్రమే కాదు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించే పరిణామం!
భవితరాలకు బంగారు భవిష్యత్తు
ప్రపంచ ఐటీ పటంలో తెలంగాణ స్థానం బలపడుతున్న వేళ, ఈ వృద్ధి కేవలం ఆర్థిక గణాంకాలకే పరిమితం కాకుండా సామాజిక మార్పుగా మన ముందుకు వస్తోంది. ఒక యువ ఇంజనీర్‌కు ఉద్యోగం, ఒక స్టార్టప్‌కు అవకాశాలు, ఒక రైతు కుటుంబానికి పట్టణాల్లో స్థిరపడే భరోసా... ఇవన్నీ తెలంగాణ ఐటీ విప్లవంలో భాగమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఐటీ యంత్రాంగం ఐటీలో రాష్ట్రాన్ని మేటిగా మార్చేందుకు వేస్తున్న అడుగులు, భవితరాలకు బంగారు భవిష్యత్తును ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


E-Paper












