తెలంగాణ ప్రాజెక్టులకు నేను అడ్డు చెప్పలేదు.. పోలవరంలో మిగిలిన నీళ్లు వారు వాడుకోవచ్చు : చంద్రబాబు

పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదని తెలిపారు. తెలుగు రాష్ట్రాలూ గోదావరి జలాలను సమర్ధంగా వినియోగించుకోవచ్చన్నారు.

Published on: Jan 12, 2026, 16:46:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డుల గురించి ఎక్కడో వినేవాళ్లం ఇప్పుడు భారత్‌లో, అందులో ఏపీలోనూ నమోదు అవుతున్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

గోదావరి పుష్కరాల కంటే ముందే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే నల్లమల సాగర్ ద్వారా రాయలసీమకు నీటిని సరఫరా చేసే అవకాశం ఉందని, అంతేకాకుండా మిగులు జలాలను తెలంగాణకు కూడా సరఫరా చేసే అవకాశం ఉందని అన్నారు. తాను కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పుడూ వ్యతిరేకించలేదని, 3000 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోతున్నందున పోలవరం ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు నేనెప్పుడూ అడ్డు చెప్పలేదని, పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణ వినియోగించుకోవచ్చన్నారు.

రూ.1200 కోట్ల కేంద్ర సహాయంతో పునరుద్ధరించిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మనం కాపాడగలిగామని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని, బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం దేశంలో 25 శాతం పెట్టుబడులను ఒక్క ఆంధ్రప్రదేశే దక్కించుకుందని పేర్కొన్నారు. అన్ని పెట్టుబడులు కార్యరూపం దాల్చినప్పుడు 16 లక్షల మందికి పైగా యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందన్నారు.

ఆరు నెలల్లోపు అమరావతి నుండి క్వాంటం కంప్యూటర్ వాస్తవ రూపం దాల్చనుందని చంద్రబాబు తెలిపారు. విద్యుత్ రంగ సంస్కరణల ద్వారా విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్‌కు 1.19 పైసలు తగ్గిందన్నారు. జలవనరుల విషయంలో కూడా రాష్ట్రం వివిధ జలాశయాలలో 970 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగిందని చెప్పారు.

'సంక్షేమం-అభివృద్ధి, సుపరిపాలనను సమతుల్యం చేస్తూ సంకీర్ణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సంక్షేమ పథకాల అమలులో ఏపీ ముందంజలో ఉంది. 18 నెలల కాలంలో రూ. 50,000 కోట్ల సామాజిక పింఛన్లను పంపిణీ చేసి ఒక మైలురాయిని నెలకొల్పం. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.10,090 కోట్లు జమ చేసింది. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 1114 కోట్లు ఖర్చు చేసింది. 3.5 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద 46 లక్షల మంది రైతులకు రూ. 6310 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. దీపం పథకం కింద మహిళలకు రెండు కోట్ల ఉచిత సిలిండర్లు పంపిణీ చేశాం.' అని చంద్రబాబు చెప్పారు.

వచ్చే నెలలో కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించి జీఎస్డీపీ అంశాలను మరోమారు పరిశీలిస్తామని చంద్రబాబు తెలిపారు. పది సూత్రాల అమలు పర్యవేక్షణకు పది మంది అధికారులను టాస్క్ ఫోర్సుగా ఏర్పాటు చేశామని, క్షేత్రస్థాయిలో వీటిని సరిగ్గా అమలు చేసేందుకు బాధ్యత తీసుకోవాలన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలు కేంద్ర నిధుల్ని ఖర్చు చేయటం లేదని, ఈ నెలాఖరు లోగా వందశాతం నిధులు వ్యయం చేయాల్సిందేనని ఆదేశించారు. కేంద్ర నిధులు ఖర్చు చేసేసి అదనపు నిధులకు వెళ్లాలని చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More