వాట్సాప్‌లో NO అంటే బ్యాంకు ఖాతా ఖాళీ.. ఓటీపీలు అడగరు, లింకులు నొక్కక్కర్లేదు!

వాట్సాప్ సందేశంతోనే క్షణాల్లో సొమ్ము స్వాహా అవుతున్నాయి. ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్‌తో కేటుగాళ్ల సరికొత్త పన్నాగం పన్నుతున్నారు. కేవలం నో చెబితే చాలు మీ అకౌంట్లో సొమ్ము ఖాళీ అవుతుంది.

Published on: Oct 12, 2026, 21:59:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

వాట్సాప్‌లో వచ్చిన ఒకే ఒక్క సందేశానికి కేవలం 'NO' అని రిప్లై ఇచ్చినందుకే ఒకరి బ్యాంక్ ఖాతా క్షణాల్లో నిలువునా ఖాళీ అయిపోయింది. బాధితుడు ఎవరికీ ఎలాంటి ఓటీపీ చెప్పలేదు.. ఏ అనుమానాస్పద లింక్‌పైనా క్లిక్ చేయలేదు.. కేవలం 'NO' అనే రెండక్షరాల సమాధానమే జీవితకాల సంపాదనను తుడిచిపెట్టేసింది.

వాట్సాప్‌ స్కామ్
వాట్సాప్‌ స్కామ్

ఇటీవల ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను సైతం నిలువునా ముంచేసిన ఈ సరికొత్త సైబర్ నేరం నా దృష్టికి వచ్చింది. సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు పన్నిన అత్యంత ప్రమాదకరమైన ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్ ఇది అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

ఈ మోసం ఎలా జరుగుతోందంటే.. మొదట గుర్తుతెలియని నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు ‘మీ ఖాతా నుంచి ఇంత మొత్తం డెబిట్ అయ్యింది అంటూ నకిలీ సందేశం వస్తుంది. ఆ వెంటనే మిమ్మల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తూ.. ‘ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే NO అని రిప్లై ఇవ్వండి’ అంటూ రెండో మెసేజ్ పంపుతారు.

'ఖాతాలో డబ్బులు పోయాయన్న కంగారుతో మీరు ‘NO’ అని టైప్ చేసి పంపిన మరుక్షణమే.. ఆ సందేశంలో కనిపించకుండా దాగి ఉన్న మాల్‌వేర్ స్క్రిప్ట్స్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. క్షణాల్లో మీ మొబైల్ ఫోన్‌పై పూర్తి నియంత్రణను హ్యాకర్లు చేజిక్కించుకుని, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మంతటినీ ఊడ్చేస్తారు.' అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.

అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే.. గుర్తుతెలియని నంబర్ల నుంచి బ్యాంక్ లావాదేవీల పేరుతో వచ్చే మెసేజ్‌లకు 'YES' గానీ, 'NO' గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రిప్లై ఇవ్వకండని సజ్జనార్ తెలిపారు. కంగారుపడి ఎలాంటి సమాధానమూ పంపకుండా వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి చాట్‌ను డిలీట్ చేయాలన్నారు.

'మీ ఖాతాలో డబ్బు కట్ అయిందో లేదో తెలుసుకోవడానికి మీ అధికారిక బ్యాంక్ యాప్‌లోకి వెళ్లి నేరుగా చెక్ చేసుకోండి తప్ప, వాట్సాప్ సందేశాలను అస్సలు నమ్మకండి. ఏ అధికారిక బ్యాంకూ వాట్సాప్‌లో ఇలా సమాధానాలు కోరదు. ఒకవేళ ఎవరైనా ఈ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్‌లో వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి. కంగారులో ఇచ్చే ఒక్క నో అనే సందేశం మీ సర్వస్వాన్నీ తుడిచిపెట్టేస్తుంది.. తస్మాత్ జాగ్రత్త.' అని సీపీ సజ్జనార్ తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More