వృథాగా పడి ఉన్న పాత బ్యాంక్ ఖాతాలో మీ డబ్బు ఉందా? సులువుగా క్లెయిమ్ చేసుకోవచ్చు..

ఏళ్ల తరబడి వాడకుండా వదిలేసిన బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ము ఎక్కడికీ పోదు. ఆర్బీఐ రూపొందించిన 'ఉద్గమ్' పోర్టల్ ద్వారా పాత డిపాజిట్లను గుర్తించి, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మళ్లీ ఖాతాను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాము,.

Published on: Oct 5, 2026, 09:12:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పాత బ్యాంక్ ఖాతాను ఎప్పుడో వాడటం ఆపేసి, అందులో ఉన్న డబ్బుల గురించి మరిచిపోయారా? అయితే ఆ సొమ్ము శాశ్వతంగా పోయిందని కంగారు పడక్కర్లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. రెండేళ్లకు పైగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించని ఖాతాలను బ్యాంకులు ‘ఇన్‌ఆపరేటివ్’ లేదా 'డార్మెంట్' ఖాతాలుగా వర్గీకరిస్తాయి. అయినప్పటికీ, మీ సొమ్ము సురక్షితంగానే ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుని తిరిగి మీ సొమ్మును ఎలా పొందవచ్చో వివరంగా చూద్దాము..

వృథాగా పడి ఉన్న పాత బ్యాంక్ ఖాతాలో మీ డబ్బు ఉందా?
వృథాగా పడి ఉన్న పాత బ్యాంక్ ఖాతాలో మీ డబ్బు ఉందా?

అసలు 'డార్మెంట్ ఖాతా' అంటే ఏంటి?

ఖాతాదారుడు స్వయంగా ఎలాంటి క్రెడిట్ లేదా డెబిట్ లావాదేవీలు జరపకుండా వరుసగా రెండేళ్లు దాటితే ఆ సేవింగ్స్ లేదా కరెంట్ బ్యాంక్ అకౌంట్​ని ఇన్‌ఆపరేటివ్‌గా మారుస్తారు. బ్యాంక్ జమ చేసే వడ్డీ లేదా బ్యాంక్ మినహాయించుకునే ఛార్జీలను ఖాతాదారుడు జరిపిన లావాదేవీలుగా పరిగణించరు. అయితే ఖాతా డార్మెంట్‌గా మారినంత మాత్రాన అది రద్దయినట్లు కాదు. కేవలం భద్రతా కారణాల దృష్ట్యా అందులోని సొమ్మును వేరొకరు దుర్వినియోగం చేయకుండా బ్యాంకులు దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తాయి.

ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేసుకోవడం ఎలా?

పాత అకౌంట్​ని తిరిగి ఉపయోగంలోకి తేవడానికి ఆర్బీఐ విధానాలను మరింత సులభతరం చేసింది.

  • ఖాతాదారులు తమ హోమ్ బ్రాంచ్‌కే కాకుండా, సంబంధిత బ్యాంక్‌కు చెందిన ఏ బ్రాంచ్‌కైనా వెళ్లి కేవైసీ పత్రాలను సమర్పించవచ్చు.
  • ప్రస్తుతం చాలా బ్యాంకులు వీడియో కేవైసీ సౌకర్యాన్ని సైతం అందిస్తున్నాయి. దీనివల్ల ఇల్లు దాటకుండానే ఖాతాను పునరుద్ధరించుకోవచ్చు.
  • బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

కేవైసీ ప్రక్రియ, వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కేవలం 3 పనిదినాల్లో ఖాతాను మళ్లీ ప్రారంభించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది.

మరి 10 ఏళ్లు దాటితే ఆ డబ్బు ఏమవుతుంది?

వరుసగా 10 ఏళ్ల పాటు ఎలాంటి క్లెయిమ్ లేని డిపాజిట్లను బ్యాంకులు ఆర్బీఐకి చెందిన 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్' (డీఈఓ) ఫండ్‌కు బదిలీ చేస్తాయి. కానీ ఆ డబ్బుపై ఖాతాదారుడికి హక్కు కోల్పోడు! ఆ తర్వాత కూడా సరైన ఆధారాలు చూపించి సంబంధిత బ్యాంకును సంప్రదిస్తే, బ్యాంక్ మీ సొమ్మును మీకు అందించి, ఆ తర్వాత డిఈఏ ఫండ్ నుంచి తిరిగి పొందుతుంది.

మర్చిపోయిన ఖాతాలను 'ఉద్గమ్' పోర్టల్‌లో వెతకండి..

వివిధ బ్యాంకుల్లో ఉండిపోయిన డిపాజిట్ల వివరాలను తెలుసుకోవడానికి ఆర్బీఐ 'ఉద్గమ్' (UDGAM - Unclaimed Deposits - Gateway to Access inforMation) అనే కేంద్రకృత పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇందులో రిజిస్టర్ చేసుకుని, ఖాతాదారుని పేరు, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా పుట్టిన తేదీ ఆధారంగా సెర్చ్ చేయవచ్చు.

ఒకవేళ ఈ వివరాలు లభించకపోయినా, చిరునామా ద్వారా కూడా పాత ఖాతాలను శోధించే వెసులుబాటు ఉంది.

ఉద్గమ్ పోర్టల్ కేవలం డబ్బులు ఏ బ్యాంకులో ఉన్నాయో గుర్తిస్తుంది. సెటిల్మెంట్ కోసం మనం ఆయా బ్యాంక్ బ్రాంచ్‌ను నేరుగా సంప్రదించాల్సి ఉంటుంది.

యాక్టివేషన్‌కు ఎలాంటి రుసుము లేదు..

పాత ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయడానికి లేదా డీఈఏ ఫండ్ నుంచి డబ్బు వెనక్కి తెచ్చుకోవడానికి బ్యాంకులు ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. కాబట్టి పాత ఖాతా అని వదిలేయకుండా వెంటనే కేవైసీ పూర్తి చేసి మీ సొమ్మును మళ్లీ వినియోగంలోకి తెచ్చుకోవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More