ఆ తేదీన కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్‌పీ భేటీ.. ఈ విషయాలపై చర్చ!
రైతుల నీటి హక్కులపై నిరసనలు తెలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకోసం కార్యాచరణ రూపొందించనుంది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 19వ తేదీన బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం.. పార్టీ కేంద్ర కార్యాలయం, తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగుతుంది. ఈ సమావేశం సందర్భంగా.. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపైన, తెలంగాణ రాష్ట్రానికి పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మీద చర్చ జరుగుతుంది.

గోదావరి, కృష్ణా జలాలను ఏపీ కొల్లగొడుతున్నా కూడా దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ చెబుతోంది. తెలంగాణ ప్రజల, రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా తదుపరి కార్యాచరణపై సమావేశంలో లోతుగా చర్చించనున్నారు కేసీఆర్.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలు అని కేంద్రం ముందు దేబరించడం బాధాకరమని బీఆర్ఎస్ అంటోంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమేనని ఆరోపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ ప్రజలు, రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడిన పాపాన పోవట్లేదని భారత రాష్ట్ర సమితి విమర్శించింది. బీజేపీ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు, రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతున్నదనేది స్పష్టమవుతున్నదని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి సహకరిస్తున్నదని విమర్శిస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ సమాజం మరొకసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.
రెండేళ్లు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఈ విషయాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలపై.. ఈనెల 19వ తేదీన కేసీఆర్ అధ్యక్షతన చర్చ జరగనున్నది. బీఆర్ఎస్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు ఉంటాయి.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, గోదావరి, కృష్ణా జలాల విషయంలో ఆంధ్ర వైఖరిపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నిరసన తెలపాలని చూస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


