వారం రోజుల్లో అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి హైవే.. హైదరాబాద్ టూ విశాఖ ప్రయాణం వేగవంతం!

Khammam-Devarapalli highway : వారం రోజుల్లో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి రానుంది. దీంతో హైదరాబాద్ టూ విశాఖ ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. విజయవాడ వెళ్లకుండానే విశాఖకు వెళ్లవచ్చు.

Published on: Aug 3, 2026, 14:44:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానిస్తూ నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ హైవే (NH-365BG) ఖమ్మం-దేవరపల్లి రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేసింది. రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ఈ సరికొత్త జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను ఆదివారం నుంచే అనధికారికంగా అనుమతించారు. వారం రోజుల్లో ఈ హైవేను అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఖమ్మం-దేవరపల్లి హైవే (@AndhraCommunity X Account)
ఖమ్మం-దేవరపల్లి హైవే (@AndhraCommunity X Account)

ఖమ్మం జిల్లా తాళ్లంపాడు గ్రామం వద్ద ప్రారంభమయ్యే ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం, దాని అనుబంధ మౌలిక వసతులు ఏడాది క్రితమే పూర్తయినప్పటికీ ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ఆలస్యం కావడంతో ఇన్నాళ్లూ ప్రారంభం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఆర్‌వోబీ పనులు పూర్తికావడంతో వాహనదారులు తాళ్లంపాడు నుంచే నేరుగా హైవేపైకి ప్రవేశించే వెసులుబాటు లభించింది.

ఈ 162.04 కిలోమీటర్ల పొడవైన రహదారి అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు సమయం భారీగా ఆదా కానుంది. హైదరాబాద్ నుండి విశాఖపట్నం మధ్య ప్రయాణ దూరం సుమారు 56 కిలోమీటర్లు తగ్గడంతో పాటు, ప్రయాణ సమయం 1 నుండి 2 గంటల వరకు కలిసిరానుంది.

తిరువూరు, నూజివీడు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, ఒడిశా, కోల్‌కతా వైపు వెళ్లే వాహనాలు ఖమ్మం నగరం లోపలికి రాకుండా బైపాస్ ద్వారా నేరుగా వెళ్ళవచ్చు. సూర్యాపేట వైపు నుంచి వచ్చే వాహనాలు తాళ్లంపాడు టోల్ ప్లాజా వద్ద ఈ రోడ్డుపైకి ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వద్ద బయటకు వెళ్తాయి.

సమీపంలోని పట్టణాలకు వెళ్లేందుకు వీలుగా ఈ హైవేపై మొత్తం 9 చోట్ల ఇంటర్‌చేంజ్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత, వేగం కోసం ఈ రహదారిపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్లకు గరిష్టంగా గంటకు 100 కి.మీ., బారీ వాహనాలకు గంటకు 80 కి.మీ. వేగపరిమితి నిర్ణయించారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తరహాలోనే ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ వసూలు చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రతి కిలోమీటర్‌కు సీసీటీవీ కెమెరాలను అమర్చారు. లారీలు, సరుకు రవాణా వాహనాల నిలుపుదల కోసం వందనం, చౌడవరం ప్రాంతాల్లో ట్రక్ లే-బై లను అభివృద్ధి చేశారు.

మొత్తం రహదారి పొడవులో 105 కిలోమీటర్లు ఖమ్మం జిల్లా పరిధిలోనే ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను ఖమ్మం పరిధిలో మూడు ప్యాకేజీలుగా రూ.2,213.91 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేశారు. హైవేకి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని, తాళ్లంపాడు యాక్సెస్ పాయింట్ నుండి వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చామని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చెప్పారు. వారం రోజుల్లో ఈ రహదారిని అధికారికంగా ప్రారంభిస్తామన్నారు. ఆ తర్వాత టోల్ వసూలు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్‌వోబీలపై వాహనాల రాకపోకలు సురక్షితమేనా అని నిర్ధారించుకోవడానికి లోడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.

ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభంతో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వ్యాపార, రవాణా రంగాలు మరింత వేగవంతం కానున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More