LPG cylinder : గుడ్ న్యూస్! మరింత తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర- హైదరాబాద్​లో రేట్లు ఇలా..

LPG cylinder price : కేంద్ర ప్రభుత్వం 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 200లకు పైగా తగ్గించింది. ఢిల్లీ, కోల్‌కతాతో పాటు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలకు పెద్ద ఉపశమనం లభించింది.

Published on: Aug 1, 2026, 07:46:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పండుగల సీజన్‌కు ముందు దేశంలోని వ్యాపార వర్గాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను తగ్గిస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. దిల్లీ, కోల్‌కతాతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధరపై దాదాపు రూ. 200 కంటే ఎక్కువ కోత విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధ ప్రభావంతో గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటిన ఇంధన ధరల నుంచి రెస్టారెంట్లు, హోటళ్లు, చిన్న తరహా పరిశ్రమలకు ఈ నిర్ణయంతో భారీ ఊరట లభించనుంది.

మరింత తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర.. (HT_PRINT)
మరింత తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర.. (HT_PRINT)

తాజా సవరణ ప్రకారం.. దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 202 తగ్గగా, కోల్‌కతాలో రూ. 209 మేర తగ్గింది. తగ్గించిన కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.

ఈ కోత తర్వాత దిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 2,728కి చేరగా, కోల్‌కతాలో రూ. 2,872.50కి లభించనుంది.

ఇక హైదరాబాద్​లో 19 కేజీల వాణిజ్య సిలిండర ధర రూ. 2985గాను, 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 994గాను ఉన్నాయి. విజయవాడలో ఎల్పీజీ సిలిండర్ల ధరలు వరుసగా రూ. 2921.50, రూ. 966.50గా ఉన్నాయి.

బెంగళూరులో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 2821గా, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 944.50గా ఉన్నాయి.

గృహ వినియోగదారులకు ఊరట లేదు..

అయితే, ఈ ఉపశమనం కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించే కమర్షియల్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ ప్రజలు ఇళ్లలో వాడే 14.2 కిలోల గృహ వినియోగ (డొమెస్టిక్) ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. వాటి ధరలు యథాతథంగానే కొనసాగుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

పశ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమై, ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే, గతనెల (జూలై)లో స్వల్పంగా తగ్గించిన కేంద్రం, ఇప్పుడు వరుసగా రెండోసారి కమర్షియల్ గ్యాస్ ధరలను మరింతగా తగ్గించి వ్యాపారులకు ఊరటనిచ్చింది.

ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష!

పశ్చిమాసియాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇంధన లభ్యతపై ప్రభావం పడకుండా చూసేందుకు రెండు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో దాదాపు రెండు గంటల పాటు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీ, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

దేశంలో ఇంధన నిల్వలు, సరఫరా వ్యవస్థపై ఈ సమావేశంలో లోతుగా సమీక్షించారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ భారతదేశంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్‌ కొరత ఏమీ లేదని, దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More