కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం.. మల్లన్న భక్తులకు అందుబాటులోకి రైలు ప్రయాణం!
Komuravelli Railway station : ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభమైంది. దీంతో మల్లన్న భక్తులకు రైలు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైన రైలు సౌకర్యం, అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు లభిస్తుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. కొత్తగా నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు లక్ష్మణ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎం. రఘునందన్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కొమురవెల్లి ఆలయ నిర్మాణ శైలి, ఆధ్యాత్మిక వైభవం ప్రతిబింబించేలా ఈ స్టేషన్‌ను రూ. 6 కోట్ల వ్యయంతో నిర్మించారు. మొదట అనుకున్న రైల్వే ప్రతిపాదనల్లో ఈ స్టేషన్ లేనప్పటికీ, స్వామివారిని దర్శించుకునే భక్తుల రద్దీ, విన్నపాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా నిర్మించారు.
సికింద్రాబాద్ - సిద్దిపేట మధ్య నడిచే డెమూ రైళ్లు ఇకపై కొమురవెల్లి స్టేషన్‌లో కూడా ఆగుతాయి.
ఇవి అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు కావడం వల్ల ప్రయాణ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి.
భక్తులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఈ చవకైన రైలు ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ రైల్వే హాల్ట్ వల్ల ఆధ్యాత్మిక పర్యాటకం పెరగడంతో పాటు స్థానిక వ్యాపారాలకు మంచి ఊతం లభిస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ, మనోహరాబాద్ - సిద్దిపేట మధ్య 76 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ పూర్తయిందని, కరీంనగర్ వైపు రైలు అనుసంధానం ఏర్పడిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన అన్నారు:
ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 47,984 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 2,000 కోట్లకు పైగా వ్యయంతో తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను పునర్నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 4 స్టేషన్ల పనులు పూర్తయి ప్రారంభమయ్యాయి.
'ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను రూ. 521 కోట్లతో అందుబాటులోకి తెచ్చాం. స్థానిక చేతివృత్తుల కళాకారులు, చేనేత కార్మికులు మరియు గిరిజన సంఘాల జీవనోపాధి కోసం రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్లలో 88 స్టాళ్లను ఏర్పాటు చేశారు.' అని కిషన్ రెడ్డి చెప్పారు.
భవిష్యత్తు మౌలిక సదుపాయాల గురించి కిషన్ రెడ్డి చెబుతూ.. హైదరాబాద్ కేంద్రంగా ఇతర ప్రధాన నగరాల రాజధానులను అనుసంధానిస్తూ, గంటకు 350 కి.మీ వేగంతో ప్రయాణించే మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ఎలివేటెడ్ ట్రాక్‌లపై నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రారంభోత్సవం అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైలులో గజ్వేల్ వరకు ప్రయాణించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


