Konda Surekha : కక్షపూరితంగా బలి చేశారు... బర్తరఫ్ నిర్ణయంపై కొండా సురేఖ సీరియస్! సీఎంపై ఘాటు వ్యాఖ్యలు
మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై కొండ సురేఖ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసి కాంగ్రెస్ అధిష్టానాన్ని బెదిరించారని…. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా కక్షపూరితంగా బలి చేశారని ఆరోపించారు.
మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై మాజీ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసి…. తనను పదవి నుంచి తొలగించేలా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒత్తిడికి గురిచేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తనను కేబినెట్ నుంచి తీసివేయకపోతే తాను సీఎం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని రేవంత్ రెడ్డి దిల్లీ పెద్దలను బెదిరించారని…. దాంతో చేసేది లేక అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

కుట్ర చేశారు - సురేఖ
నిజానికి తనను మంత్రివర్గం నుంచి తొలగించాలనే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానానికి ఏమాత్రం లేదని, కేవలం రేవంత్ చేసిన బ్లాక్‌మెయిలింగ్ వల్లే ఈ నిర్ణయం వెలువడిందని సురేఖ స్పష్టం చేశారు. తన పదవి ఊడగొట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని…. ముఖ్యంగా కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలు కలిసి ఈ కుట్రకు తెరతీశారని ఆరోపించారు.
సొంత పార్టీలోనే ఉంటూ తనను బలిచేశారని ఆవేదన వ్యక్తం చేసిన కొండ సురేఖ, సీఎం రేవంత్ రెడ్డి మూలాలు తెలుగుదేశం పార్టీలో ఉండటమే ఇందుకు కారణమని విమర్శించారు. "సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారు కాబట్టే ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. వేం నరేందర్‌రెడ్డి లాంటి వారిని వెనుకుండి నడిపిస్తూ మైండ్ గేమ్‌లు ఆడిస్తున్నారు. నాపై తీసుకున్న చర్యలు కేవలం కక్షపూరితమైనవే. ఒంట్లో టీడీపీ రక్తం ఉన్నవాళ్లే ఇలాంటి పనులు చేస్తారు," అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న సీనియర్ నేత డాక్టర్ జి. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవడాన్ని కూడా సురేఖ తప్పుపట్టారు. చిన్నారెడ్డికి దీనితో ఎలాంటి సంబంధం లేదని, కేవలం తనను టార్గెట్ చేసే క్రమంలో ఆయనను బలి చేయడం ఎంతమాత్రం సరికాదని అన్నారు. ప్రభుత్వంలో ఎంతోమంది నేతలు విమర్శలు, కామెంట్స్ చేస్తున్నారని…. మరి వారిని లేదా వారి కుటుంబాలను ఎందుకు బాధ్యులను చేయడం లేదని ప్రశ్నించారు. "కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేసినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఎందుకు? నా కుమార్తె సుస్మితను మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారు?" అని రేవంత్ సర్కార్‌ను నిలదీశారు.
తమ కుమార్తె సుస్మిత వ్యాఖ్యల వివాదంపై స్పందిస్తూ.. "మహిళలు ఇండిపెండెంట్‌గా ఉండాలని, సొంతంగా ఎదగాలని రాహుల్ గాంధీ నిత్యం చెప్తారు. మరి మా బిడ్డ మాట్లాడితే నన్ను ఎందుకు బాధ్యులను చేస్తున్నారు…? నా కూతురు ఒక ఇండిపెండెంట్. ఆమెకు ఒక కుటుంబం ఉంది. రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఆమెకు ఉంది. తన తండ్రికి కనీసం ఒక్క కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా ఇవ్వలేదనే బాధ ఆమె మనసులో ఉంది. అలాంటప్పుడు నా కూతురు మాట్లాడిన దానికి నన్ను బాధ్యురాలిని చేయడం ఏంటి? నా కూతురి వ్యక్తిగత అభిప్రాయాలను అడ్డుకునే హక్కు మాకు లేదు" అని తేల్చి చెప్పారు.
తనను కనీసం వివరణ కూడా అడగకుండానే దారుణంగా బర్తరఫ్ చేశారని సురేఖ ఆవేదన చెందారు. కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు ఇప్పటికే సమగ్రమైన లేఖ ఇచ్చానని…. అయినా తనను బలి చేయడం తీరని బాధ కలిగించిందన్నారు. అధిష్టానానికి రాసిన లేఖను కూడా మీడియాకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి తానంతట తానుగా రాజీనామా చేయలేదని, తనను ఎవరూ రాజీనామా చేయమని కూడా అడగలేదని, నేరుగా రేవంత్ రెడ్డే తనపై వేటు వేశారని స్పష్టం చేశారు.
సర్వే చేయించండి - సురేఖ
“మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పాలనతో సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా లేరని నాకు తెలుసు, మీకు తెలుసు. ఈరోజు నాకు జరిగింది, రేపు మీకూ జరుగుతుంది. ఇప్పటికైనా బయటికి వచ్చి మాట్లాడండి. మనం ఇస్తామన్న హామీలు ఇవ్వలేదు.. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై సర్వే చేయించాలని సూచిస్తున్నాను” అని సురేఖ మీడియాతో చెప్పారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

