హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, ఆర్థిక అస్తవ్యస్తత రాజ్యమేలుతున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు అవినీతికి పాల్పడిన వారు ఎంతటి హోదాలో ఉన్నా, ఎంతటి పలుకుబడి కలిగిన వారైనా సరే వారి నుంచి ప్రతి పైసా కక్కిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
సొంత ఎమ్మెల్యేలే అవినీతి బాగోతాన్ని బయటపెడుతున్నారు

అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే నేడు ప్రభుత్వ అవినీతిని బహిరంగంగా ఎండగడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పనుల్లో అధికారులు 15 నుంచి 20 శాతం కమీషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. అలాగే రాష్ట్రంలో భారీ ఎత్తున అవినీతి, టెండర్లలో అక్రమాలు జరుగుతున్నాయని, రూ. 5 లక్షల కోట్ల దోపిడీకి తెరలేపారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఆరోపణలను కేటీఆర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ శాసనసభ్యుల మాటలే రాష్ట్రంలో పాలన తీరుకు అద్దం పడుతున్నాయని, పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ఆయన విమర్శించారు.
నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు విడుదల చేయకపోవడంపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, కొందరైతే ఆర్థిక సాయం కోరుతూ లేఖలు కూడా రాస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇతర నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తూ నిధులన్నింటినీ కొడంగల్‌కు మళ్లిస్తున్నారన్న ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. అభివృద్ధి నిధుల కోసం సొంత పార్టీ ఎమ్మెల్యేలే నానా తంటాలు పడాల్సిన దుస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ లోపలి నుంచి మరిన్ని అవినీతి ఆరోపణలు బయటకు వస్తాయని కేటీఆర్ జోస్యం చెప్పారు. "బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చాక అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తాం. దోషులుగా తేలితే ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా సరే ఎవరినీ వదిలిపెట్టం" అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కొత్త పింఛన్ల పేరుతో లబ్ధిదారుల కోత
కొత్త పింఛన్లు ఇస్తున్నామంటూ ప్రభుత్వం ఆసరా లబ్ధిదారులను తప్పుదోవ పట్టిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సుమారు 44.70 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉండేవారని ఆయన వివరించారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాదిలో 1.50 లక్షలు, రెండో ఏడాదిలో మరో 1.50 లక్షలు, మూడో ఏడాదిలో 1.70 లక్షల పింఛన్లను తొలగించారని.. మొత్తంగా 4.70 లక్షల మంది పాత లబ్ధిదారుల పింఛన్లను ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు.
{{/usCountry}}కొత్త పింఛన్లు ఇస్తున్నామంటూ ప్రభుత్వం ఆసరా లబ్ధిదారులను తప్పుదోవ పట్టిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సుమారు 44.70 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉండేవారని ఆయన వివరించారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాదిలో 1.50 లక్షలు, రెండో ఏడాదిలో మరో 1.50 లక్షలు, మూడో ఏడాదిలో 1.70 లక్షల పింఛన్లను తొలగించారని.. మొత్తంగా 4.70 లక్షల మంది పాత లబ్ధిదారుల పింఛన్లను ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు.
{{/usCountry}}ఇంతమందిని తొలగించిన ప్రభుత్వం, కొత్తగా కేవలం 4.63 లక్షల పింఛన్లను మాత్రమే మంజూరు చేసిందని కేటీఆర్ లెక్కలతో సహా వివరించారు. అంటే నికరంగా దాదాపు 7,000 మంది లబ్ధిదారులు తగ్గిపోయారని ఆయన ఎత్తిచూపారు. మొత్తం పింఛన్ల సంఖ్య తగ్గిపోయినప్పుడు, లబ్ధిదారుల పరిధిని విస్తరించామని ప్రభుత్వం ఎలా చెప్పుకుంటుందని కేటీఆర్ నిలదీశారు.
మూడు డిసెంబర్లు గడిచినా రూ. 4,000 పింఛన్ ఏదీ?
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నెలవారీ పింఛన్‌ను రూ. 4,000కు పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీని కేటీఆర్ గుర్తుచేశారు. నవంబర్‌లో రూ. 2,000 ఇస్తామని, డిసెంబర్ నుంచి రూ. 4,000 చొప్పున చెల్లిస్తామని నాడు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కానీ మూడు డిసెంబర్ నెలలు గడిచిపోయినా లబ్ధిదారులకు ఇప్పటికీ కేవలం రూ. 2,000 మాత్రమే అందుతున్నాయని ఆయన విమర్శించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భద్రత, ఆత్మగౌరవం కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం పింఛన్‌ను రూ. 200 నుంచి రూ. 2,000కు పెంచిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలో కొనసాగి ఉంటే లబ్ధిదారులకు పెంచిన పింఛన్ సొమ్ము కచ్చితంగా అందేదని అన్నారు.
ఆరు గ్యారెంటీల అమలుపైనా కేటీఆర్ కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. హామీలు నెరవేర్చనప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పంచిన గ్యారెంటీ కార్డులకు విలువ ఏముందని ఆయన ప్రశ్నించారు.
భూపాలపల్లి అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే..
భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు గురువారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భూపాలపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. భూపాలపల్లికి మున్సిపాలిటీ, జిల్లా కేంద్రం, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం నియోజకవర్గ అభివృద్ధిలో కీలక మైలురాళ్లు అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సంఖ్యను 32కు పెంచి వేలాది మంది విద్యార్థుల వైద్య విద్య కలను సాకారం చేసిందని తెలిపారు.
ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లుతున్నారు..
తెలంగాణ ప్రయోజనాల కంటే ఢిల్లీలోని తమ రాజకీయ అధిష్ఠానాల మెప్పు పొందడానికే కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. జాతీయ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆయన చురకలంటించారు. పార్టీ హైకమాండ్ ముందు సీఎం అతిగా వినయం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా బీజేపీ నేతలు వ్యవహరించిన తీరును కూడా కేటీఆర్ తప్పుబట్టారు.
ఆత్మగౌరవ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధులు నిలబడాలి తప్ప, జాతీయ నాయకత్వం ముందు సామంతుల్లా వ్యవహరించకూడదని కేటీఆర్ హితవు పలికారు. ఢిల్లీ పెద్దల రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఆర్థిక వనరులను మళ్లిస్తున్నారని ఆరోపించిన ఆయన, రేవంత్ రెడ్డిని 'రెన్యూవల్ ముఖ్యమంత్రి' అని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, అవినీతి ఆరోపణలు, పింఛన్ల కోత, నెరవేరని ఎన్నికల హామీలు, ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ సర్కారును నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.