KTR On The Paradise Movie : అణచివేతపై ప్రజల పోరాటాన్ని కళ్లకు కట్టారు - ‘ది ప్యారడైజ్’ మూవీపై కేటీఆర్

KTR The Paradise Movie Review  : హీరో నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీక్షించారు. తెలంగాణ భాష, సంస్కృతి, అణచివేతపై ప్రజల పోరాటాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని చిత్రబృందాన్ని ప్రశంసించారు.

Published on: Sep 27, 2026, 07:55:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీక్షించారు. సినిమా ప్రదర్శన అనంతరం థియేటర్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ…. చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. సమాజంలో అణచివేత, అన్యాయం ఎదురైనప్పుడు ఆ సమాజం తన అస్తిత్వ పరిరక్షణ కోసం ఏ విధంగా పోరాడుతుందో ఈ సినిమాలో అద్భుతంగా చూపించారని పేర్కొన్నారు.

సుదర్శన్ థియేటర్ లో కేటీఆర్
సుదర్శన్ థియేటర్ లో కేటీఆర్

"ఒక సమాజం న్యాయం కోసం గళమెత్తే తీరును, అణచివేతకు గురైన ప్రజల పక్షాన ఒక నాయకుడు నిలబడి వారిని ముందడుగు వేయించిన తీరును దర్శకుడు అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించారు" అని కేటీఆర్ వివరించారు.

తెలంగాణ నేల స్వభావానికి, ఇక్కడి సహజసిద్ధమైన యాస, భాష, సంస్కృతికి అద్దం పడుతూ ఈ చిత్రాన్ని ఒక గొప్ప దృశ్య కావ్యంలా మలిచారని చెప్పారు. అణచివేతకు గురైనప్పుడు సామాన్య ప్రజలు ఏ రీతిలో తిరగబడతారో చూపిస్తూ, సమాజానికి ఒక బలమైన సందేశాన్ని అందించారని ఆయన అభిప్రాయపడ్డారు.

అసలైన ప్రేరణ ఎవరో అందరికీ తెలుసు!

సినిమా కథాంశం వెనుక ఉన్న సందేశాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈ సినిమా నేపథ్యానికి, ఇందులో చూపించిన అస్తిత్వ పోరాటానికి అసలైన ప్రేరణ ఎవరో నేను ప్రత్యేకంగా పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అది చూసిన ప్రతి ఒక్కరికీ, సాధారణ ప్రజానీకానికి ఇప్పటికే స్పష్టంగా అర్థమైపోయింది" అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, చారిత్రక పోరాట స్ఫూర్తిని వెండితెరపై ప్రతిబింబించేలా చేసినందుకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని, అలాగే చిత్ర నిర్మాణ బృందానికి కేటీఆర్ తన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొని సినిమాను తిలకించారు. ఇక కేటీఆర్ రాకతో సుదర్శన్ థియేటర్ వద్ద సందడి కనిపించింది.

అంతేకాకుండా మూవీపై కేటీఆర్ ట్వీట్ లో కూడా పోస్ట్ చేశారు. “అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు. కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు “చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా!!” You know who that is” అంటూ రాసుకొచ్చారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More