...
...
Next Story

పెరగనున్న భూముల ధరలు.. మే 1 నుంచి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ ధరలు!

Real Estate : తెలంగాణలో స్థిరాస్తి మార్కెట్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలో భూములు, నివాస, వాణిజ్య భవనాల మార్కెట్ విలువలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

Updated on: Apr 25, 2026, 10:20:33 IST
Advertisement

తెలంగాణలో భూమి, నివాస, వాణిజ్య భవనాల మార్కెట్ విలువను పెంచిన రేట్లతో సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పెంపులు మే మొదటి వారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో జరిగిన రెవెన్యూ సమీకరణపై కేబినెట్ ఉపసంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి మార్కెట్ విలువలను సవరించడం ఇదే మొదటిసారి. కాగా గతంలో 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ సవరణ జరిగింది.

పెరగనున్న భూముల ధరలు
పెరగనున్న భూముల ధరలు

పెంపు పరిమాణాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, అపార్ట్‌మెంట్ల మార్కెట్ విలువను కొద్దిగా పెంచుతూ, వాణిజ్య భవనాల విలువను స్వల్పంగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రాంతాన్ని బట్టి వ్యవసాయ భూమి మార్కెట్ విలువ రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. చాలా సందర్భాల్లో ప్రస్తుతం ఎకరాకు రూ. 6 లక్షలుగా ఉన్న భూమి ధర రూ. 12 లక్షల నుంచి రూ. 18 లక్షల మధ్యకు పెరగవచ్చు.

ప్రధాన పట్టణ శివారు ప్రాంతాలలో ప్రభుత్వ విలువలు బహిరంగ మార్కెట్ ధరల కంటే గణనీయంగా తక్కువగా ఉంటాయి. ఉదాహణకు బహిరంగ మార్కెట్‌లో ఎకరాకు రూ. 10 కోట్ల నుండి రూ. 20 కోట్లు ఉండగా, అధికారిక రికార్డులలో కొన్నిసార్లు రూ. 20 లక్షలు మాత్రమే ఉంటాయి. ఈ వ్యత్యాసాన్ని పూడ్చడానికి ప్రభుత్వం 300 శాతానికి పైగా పెంపును పరిశీలిస్తోందని సమాచారం.

ఔటర్ రింగ్ రోడ్ (ORR)ను ఆనుకుని ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల వల్ల పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ ప్రాంతాలలో భూముల విలువలు మూడు రెట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లోని ఖాళీ ప్లాట్లు, నివాస లేఅవుట్‌ల ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుత మార్కెట్ ధరల కంటే వాణిజ్య ఆస్తుల ధరలు ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాలలో వాటి విలువలను కొద్దిగా తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో కొత్త కంపెనీలు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించి తద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు, ఆస్తుల విలువలను చదరపు అడుగుకు రూ. 7,000 నుండి రూ. 6,500కు తగ్గించవచ్చు.

మే నెల నుంచి రిజిస్ట్రేషన్ విలువ కూడా పెరగనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర జనాలు భారీగా ఉన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe