...
...
Next Story

అర్ధరాత్రి మల్కాజ్‌గిరి సీపీ సుమతి ఆపరేషన్.. వేధించిన 40 మంది పోకిరీలు!

Malkajgiri CP Sumathi : అర్ధరాత్రి మల్కాజ్‌గిరి సీపీ సుమతి కీలక ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా 40 మంది పోకిరీలు ఆమెను చుట్టుముట్టి ప్రశ్నలు వేశారు.

Published on: May 06, 2026 01:57 PM IST
Advertisement

అర్ధరాత్రి సమయంలో మల్కాజ్‌గిరి సీపీ సుమతి కీలక ఆపరేషన్ చేపట్టారు. యూనిఫామ్ వెనక ఉన్న సామాన్య మహిళా వేదనను అర్థం చేసుకున్నప్పుడే నిజమైన భద్రత సాధ్యమని నిరూపించారు మల్కాజ్‌గిరి కొత్త కమిషనర్ సుమతి. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఆమె క్షేత్రస్థాయిలో మహిళల భద్రతను పరీక్షించేందుకు రంగంలోకి దిగారు.

మల్కాజ్‌గిరి సీపీ సుమతి కీలక ఆపరేషన్
మల్కాజ్‌గిరి సీపీ సుమతి కీలక ఆపరేషన్

అర్ధరాత్రి సమయం.. అందరూ నిద్రపోతున్న వేళ, నగరంలోని ఒక బస్టాండ్‌లో ఒక సామాన్య మహిళ ఒంటరిగా నిలబడి ఉన్నారు. ముఖానికి మాస్క్ ధరించి, సాధారణ దుస్తుల్లో ఆమె బస్టాండ్‌లో నిల్చున్నారు. ఒక సీపీగా కాకుండా, రక్షణ కోరుకునే ఒక సగటు మహిళగా అక్కడ ఎదురయ్యే పరిస్థితులను స్వయంగా తెలుసుకోవాలని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

అక్కడ నిల్చున్నది పోలీస్ అధికారి అని తెలియని కొందరు ఆకతాయిలు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. చూస్తుండగానే సుమారు 40 మంది పోకిరీలు ఆమె చుట్టూ చేరారు. అసభ్యకరమైన కామెంట్స్ చేయడం, రకరకాల ప్రశ్నలతో వేధించడం మొదలుపెట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇలా వేధింపులకు పాల్పడిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉండటం గమనార్హం.

పరిస్థితిని గమనిస్తున్న సీపీ సుమతి వెంటనే తన బృందానికి సిగ్నల్ ఇచ్చారు. క్షణాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆకతాయిలను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అప్పటిదాకా వేధించిన వారు, ఆమె సీపీ అని తెలియగానే వణికిపోయారు. పట్టుబడిన వారందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారికి, వారి తల్లిదండ్రులకు గట్టిగా కౌన్సెలింగ్ ఇచ్చారు.

మహిళల భద్రత కేవలం మాటల్లో ఉండకూడదు, క్షేత్రస్థాయిలో వారు ధైర్యంగా తిరగగలిగినప్పుడే వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని ఈ ఆపరేషన్ ద్వారా సీపీ సుమతి సందేశం పంపారు. తొలిరోజే ఇలాంటి వినూత్న ఆపరేషన్ చేపట్టిన సీపీ సుమతిపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. మహిళా భద్రత పట్ల ఆమె చూపిస్తున్న ఈ చిత్తశుద్ధి ఆదర్శంగా నిలుస్తోంది.

కమిషనరేట్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అందరం ఒక టీమ్ లాగా పనిచేసి మల్కాజిగిరి కమిషనరేట్ పేరును రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెడదామని పిలుపునిచ్చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేకుండా, సామాన్య ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని సుమతి స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe