ఖమ్మంలో బాలికపై అత్యాచారం.. భవనంపై నుంచి తోసేసిన నిందితుడు.. అసలు ఏం జరిగింది?

ఖమ్మంలో బాలికపై అత్యాచార ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ కేసుపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉంది.

Published on: Jun 11, 2026, 15:14:18 IST
By , Khammam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఖమ్మం నగరంలో గుండెల్ని పిండేసే అత్యంత ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అపార్ట్‌మెంట్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, తను చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆమెను రెండో అంతస్తుపై నుంచి కిందకు తోసేసాడు ఒక కిరాతకుడు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా, రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అసలు ఏం జరిగింది?

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఓ కుటుంబం సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తోంది. ఆ కుటుంబంలో మైనర్ బాలిక ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసిన నిందితుడు మహ్మద్ గౌస్ ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం, ఆమె ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతుందేమోనని భయపడ్డాడు. తన నేరాన్ని దాచడం కోసం, సదరు బాలికను అపార్ట్‌మెంట్ భవనం పైనుంచి కిందకు తోసేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

భవనం పైనుంచి పడటంతో బాలికకు తీవ్ర రక్తస్రావమై, ఎముకలు విరిగాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాలిక కూడా కొద్ది కొద్దిగా జరిగిన విషయాన్ని చెప్పింది. తొలుత ఇదొక ప్రమాదంగా భావించినప్పటికీ, పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు కిరాతకం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

మంత్రి తుమ్మల పరామర్శ

ఈ అమానుష ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోని ఆసుపత్రికి చేరుకుని, చికిత్స పొందుతున్న బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి తుమ్మల అధికారులతో మాట్లాడి బాలికకు మెరుగైన ఉచిత వైద్య సహాయం అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

'ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడే వారిని సమాజం క్షమించదు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. నిందితుడిపై కఠిన చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి, నిందితుడికి త్వరలోనే కఠిన శిక్ష పడేలా చూస్తాం.' అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ఈ ఘటనపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ (BRS) పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి ఈ ఘటనే నిదర్శనమని మండిపడ్డారు. 'ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన దాడి అత్యంత హేయమైనది. నిందితుడు ఎంతటి వాడైనా వదిలిపెట్టకూడదు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆపం.' అని కేటీఆర్ అన్నారు.

టీఆర్‌ఎస్ నేత కవిత ఈ ఘటనపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, మైనర్ బాలికల రక్షణ విషయంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆమె విమర్శించారు. ఖమ్మం నగరంలో ఒక అపార్ట్‌మెంట్‌లో బాలికపై లైంగిక దాడి చేసి, పైనుంచి తోసేసే ధైర్యం క్రిమినల్స్ కి ఎలా వస్తోంది? నిందితుడికి ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి తక్షణమే భారీ ఆర్థిక సాయం ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు.

ఈ ఘోర ఘటనకు వ్యతిరేకంగా ఖమ్మంలో స్థానికులు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ఊపందుకుంది. ప్రభుత్వం ఈ కేసును ఎంత వేగంగా విచారించి, బాధితురాలికి న్యాయం చేస్తుందో చూడాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More