'నా పిల్లలను ఒక్కసారి చూడాలి' అని వచ్చిన తండ్రి.. చంపేసిన భార్య, బావమరిది!
హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. పిల్లలను చూడాలని వస్తే.. భార్య, బావమరిది కలిసి ప్రాణాలు తీశారు. ఓ యువకుడు వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కుటుంబ కలహాలు, మరోవైపు క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కన్నబిడ్డలను చూడాలనే ఆరాటంతో వచ్చిన ఓ తండ్రి.. భార్య, బావమరిది చేతుల్లోనే దారుణ హత్యకు గురైన విషాద ఘటన హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం హజీపూర్‌కు చెందిన గురు వెంకటేశ్ (31)కు, మహబూబ్‌నగర్ జిల్లా మల్కాపూర్‌కు చెందిన స్వప్నకు 2015లో ప్రేమ వివాహం జరిగింది. ఎస్‌ఆర్ నగర్‌లో కాపురం పెట్టిన ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు జన్మించారు. అయితే వెంకటేశ్‌కు ఉన్న మద్యం అలవాటు వల్ల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మనస్పర్థలు తీవ్రమవడంతో నాలుగేళ్ల క్రితం దంపతులిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి స్వప్న తన పిల్లలతో కలిసి వనస్థలిపురంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో తన తల్లి, సోదరుడి వద్ద ఉంటోంది.
విడిపోయినా కన్నపిల్లలపై ప్రేమతో వెంకటేశ్, తన బిడ్డలను ఎలాగైనా చూడాలన్న తపనతో రెండు రోజులుగా వనస్థలిపురానికి వస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో స్వప్న ఉంటున్న ఫ్లాట్ తలుపు కొట్టాడు. తలుపు తీసింది భార్య స్వప్న. అక్కడే ఆమె సోదరుడు దుబ్బాల పాండు, అతని స్నేహితుడు జగదీశ్ కూడా ఉన్నారు. వారితో వెంకటేశ్ మాట్లాడాడు. "నా పిల్లలను ఒకసారి చూపిస్తే వెళ్ళిపోతాను" అని ప్రాధేయపడ్డాడు.
కానీ అర్ధరాత్రి పూట రావడంతో ఆగ్రహానికి గురైన పాండు, జగదీశ్.. వెంకటేశ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ముఖం, కడుపుపై బలంగా కొట్టడంతో వెంకటేశ్ ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్‌ను 7వ అంతస్తు నుంచి 3వ అంతస్తుకు మెట్ల మార్గంలో ముగ్గురు కలిసి కిందకు లాక్కొస్తుండగా.. అదే సమయంలో పైకి వస్తున్న ఒక స్థానిక యువకుడు మొబైల్‌లో వీడియో తీశాడు.
దీంతో భయపడిపోయిన నిందితులు ముగ్గురూ వెంకటేశ్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. రాత్రంతా రక్తస్రావంతో మెట్లపైనే పడి ఉన్న వెంకటేశ్, తెల్లవారేసరికి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్వప్న, పాండులను అదుపులోకి తీసుకోగా, జగదీశ్ కోసం గాలిస్తున్నారు. యువకుడు తీసిన వీడియోనే ఈ కేసులో కీలక ఆధారంగా మారింది.
తండ్రి ప్రాణాలు కోల్పోగా, తల్లి జైలు పాలైంది. కళ్లముందే తండ్రిని కోల్పోయి, తల్లికి దూరమైన ఆ ఇద్దరు పసిపిల్లల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పెద్దల పంతాలకు చివరకు అమాయక పిల్లలు బలిపశువులయ్యారు. కడుపులో దెబ్బలు తగిలి కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సింది పోయి, మెట్లపై వదిలేసి పారిపోవడం నిందితుల క్రూరత్వానికి అద్దం పడుతోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


