అక్టోబర్ 2వ తేదీన మాంసం దుకాణాలు బంద్.. జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు!

అక్టోబర్ 2వ తేదీన మాంసం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. అంతేకాదు ఆ రోజు డ్రైడే అమలులో ఉంటుంది. అంటే మద్యం అమ్మకాలను నిషేధిస్తారు.

Published on: Sep 30, 2026, 15:57:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మహాత్మా గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలో అక్టోబర్ 2న అన్ని రకాల జంతు వధశాలలు (స్లాటర్‌హౌస్‌లు), మాంసం, బీఫ్ విక్రయ దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గాంధీజీ అహింసా సిద్ధాంతాలు, ఆయన విశిష్టతను గౌరవిస్తూ జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ బుధవారం ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చట్టం, 1955లోని సెక్షన్ 533(బి) కింద ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. మేకలు, గొర్రెలు, పశువుల వధశాలలతో పాటు నగరవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ చికెన్, మటన్, బీఫ్ షాపులు అక్టోబర్ 2న పూర్తిగా మూతపడనున్నాయి.

హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ జారీ చేసిన నిబంధనలు కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పోలీస్ యంత్రాంగాన్ని కోరారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లకు లేఖలు రాస్తూ, పశువధ శాలలు, మాంసం దుకాణాలు తెరిచి ఉంచకుండా చర్యలు తీసుకోవడానికి మున్సిపల్ అధికారులకు అవసరమైన పోలీసు బందోబస్తు, సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఆదేశాలను ఉల్లంఘించి అక్టోబర్ 2న ఎవరైనా అక్రమంగా మాంసం విక్రయించినా లేదా జంతు వధకు పాల్పడినా వారిపై జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. నగర ప్రజలు, వ్యాపారులు ఈ నిబంధనలకు సహకరించి, గాంధీ జయంతి వేళ జీహెచ్‌ఎంసీ మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు.

డ్రైడే

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా డ్రై డే అమలులో ఉంటుంది. గాంధీజీ సిద్ధాంతాలను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఈ రోజున మద్యం అమ్మకాలను నిషేధిస్తారు. అక్టోబర్ 2వ తేదీ వేకువజామున నుంచి అర్ధరాత్రి వరకు వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు పూర్తిగా మూతపడతాయి. వైన్ షాపులతో పాటుగా రెస్టారెంట్ బార్లు, పబ్‌లు, స్టార్ హోటళ్లు, డిస్ట్రిబ్యూటర్ సెంటర్లలో కూడా మద్యం విక్రయాలు నిలిపివేస్తారు. ఎక్సైజ్ శాఖ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయించినా లేదా నిల్వ చేసినా వారిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More