44 వేలకుపైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

రాష్ట్రంలో 44 వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు.

Published on: Feb 12, 2026, 20:28:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని పేర్కొన్నారు.

అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష
అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష

అక్రిడిటేషన్ కార్డుల జారీ విధానం, అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

44 వేలకుపైగా అక్రిడిటేషన్ కార్డులు - మంత్రి పొంగులేటి

అక్రిడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ముందుగా జి.ఓ. 252 జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అనంతరం జర్నలిస్టు సంఘాలతో సమావేశమై వారి సూచనలు, అభిప్రాయాలను సవివరంగా పరిగణనలోకి తీసుకొని అవసరమైన సవరణలు చేసి జి.ఓ. 103ను జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ సవరణల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు డిజిటల్ మీడియా విభాగాల్లో మొత్తం 44,706 అక్రిడిటేషన్ కార్డులు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు.

గతంలో సుమారు 23 వేల మందికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు ఉండగా, తాజా నిర్ణయంతో దాదాపు 21 వేలకు పైగా కార్డుల సంఖ్య పెరుగుతుంద‌ని మంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. 2.50 ల‌క్ష‌ల పైగా స‌ర్క్యులేష‌న్ ఉన్న 8 పత్రికలకు 6,256 కార్డులు, 75 వేల నుండి 2.50 లక్షల వ‌ర‌కు సర్క్యులేషన్ ఉన్న24 పత్రికలకు 17,784 కార్డులు అందుతాయని పేర్కొన్నారు.

25001 నుంచి 75 వేల వ‌ర‌కు స‌ర్క్యులేష‌న్ ఉన్న‌ 30 ప‌త్రిక‌ల‌కు 3,390, అదేవిధంగా 15001 నుంచి 25000 వ‌ర‌కు స‌ర్క్యులేష‌న్ ఉన్న 169 చిన్న ప‌త్రిక‌ల‌కు 11,661, 15వేలలోపు సర్క్యులేష‌న్ ఉన్న 113 చిన్న ప‌త్రిక‌ల‌కు 226, పీరియాడిక‌ల్స్‌కు 624, 20 న్యూస్ ఏజ‌న్సీల‌కు 68 అక్రిడిటేష‌న్‌లు పొందుతాయ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు.

21 శాటిలైట్ ఛానళ్లకు 4,431 కార్డులు, 8 జాతీయ ఛాన‌ల్స్‌కు 32, వంద లోకల్ కేబుల్ ఛానళ్లకు 200, డిజిటల్ మీడియా విభాగానికి 10 కార్డులు మొత్తంగా 44,706 కార్డులు కేటాయించిన‌ట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో 16,056, నియోజకవర్గ మరియు మండల స్థాయిలో 28,650 మంజూరు చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఇక నిరంతర ప్రక్రియ…

‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍అక్రిడిటేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి మరోసారి సమావేశమై తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా ప్రతినిధుల గౌరవం, భద్రత, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More