కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన!

తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను యథాతథంగా కొనసాగిస్తామని, హైకోర్టులో స్టే ఎత్తివేయించి మళ్లీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బీఆర్ఎస్ నేతలు దీనిని రాజకీయ చేస్తున్నారని మండిపడ్డారు.

Published on: Aug 17, 2026, 16:40:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం అందిస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాల అమలుపై హైకోర్టు మధ్యంతర స్టే విధించిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకాలపై విధించిన స్టేను తొలగించేందుకు త్వరలోనే హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేసింది. గత ప్రభుత్వం తెచ్చిన లోపభూయిష్టమైన ఉత్తర్వుల వల్లే ప్రస్తుత న్యాయపరమైన చిక్కులు తలెత్తాయని, త్వరలోనే అన్ని పొరపాట్లను సరిదిద్ది పథకాలను కొనసాగిస్తామని ప్రకటించింది.

మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి గతంలో జారీ చేసిన 8 జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ (W.P. No. 21732/2026)పై విచారణ జరిపిన హైకోర్టు, 12.08.2026న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. 09.09.2026 వరకు ఈ పథకాలపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తూనే, పేద ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమగ్ర కౌంటర్ అఫిడవిట్‌ ద్వారా ఈ పథకాల రాజ్యాంగబద్ధతను, అవసరాన్ని కోర్టుకు వివరిస్తామని ప్రభుత్వం తెలిపింది.

2014లో పథకాన్ని ప్రారంభించిన సమయంలో అప్పటి ప్రభుత్వం సరైన నిబంధనలతో జీవోలు ఇవ్వలేదని, అందుకే ఇప్పుడు సాంకేతిక ఆధారాలతో కోర్టులో పిటిషన్లు పడ్డాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ప్రభుత్వంలో న్యాయపరమైన అంశాలు చూసే అధికారుల లోపమా లేదా విభాగాధిపతుల అలసత్వమా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ఎలాంటి జాప్యం లేకుండా 'గ్రీన్ ఛానెల్' ద్వారా నిధులను నేరుగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు హైకోర్టు స్టేను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దీని రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని మండిపడ్డారు.

'గత ప్రభుత్వం తెచ్చిన పథకం అని నిర్లక్ష్యం చేయకుండా కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంత మందికి ఇళ్లు ఇచ్చారు. ఎంత మందికి ఉపాధి కల్పించారు చర్చ చేద్దాం. బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తూ నిరసనలు తెలుపుతుంది. పేదలకు నష్టం కలగకుండా న్యాయపరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ప్రభుత్వం వినియోగిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర కౌంటర్ అఫిడవిట్ ద్వారా పథకాల చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత, ప్రజా ప్రయోజనాన్ని వివరించింది.' అని పొన్నం ప్రభాకర్ అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More