ఇంటి వద్దకే మీ సేవ.. అప్లికేషన్ తీసుకునే ఏజెంట్ ఇంటికి రావాలంటే ఏం చేయాలి?

Mee Seva at Home : తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇంటి వద్దకే మీ సేవ సర్వీసులను ప్రారంభించారు. దీంతో జనాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.

Updated on: Sep 23, 2026, 22:09:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పాలనను మరింత సులభతరం చేస్తూ.. ప్రభుత్వ సేవలను పౌరుల చెంతకే చేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేసింది. ఇకపై ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు, ఇతర సర్వీసుల కోసం మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దకే మీ సేవ సర్వీసులు కార్యక్రమాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు.

ఇంటి వద్దకే మీ సేవ
ఇంటి వద్దకే మీ సేవ

హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దీనికి సంబంధించిన అధికారిక పోర్టల్‌ను మంత్రి లాంఛనంగా ఆవిష్కరించారు.

ఇంటి వద్దనే మీ సేవ సేవలు పొందడానికి ప్రభుత్వం రెండు అత్యంత సులువైన మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. పౌరులు నేరుగా 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ మీ సేవ పోర్టల్ ద్వారా తమకు అనుకూలమైన సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

ఈ రెండు విధానాల్లో ఏదైనా ఒక విధంగా మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ పూర్తయిన వెంటనే, కేటాయించిన సమయానికి మీ సేవ ఎగ్జిక్యూటివ్ నేరుగా మీ ఇంటికే వచ్చి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ డోర్ డెలివరీ విధానం ద్వారా నిత్యం ప్రజలకు అవసరమయ్యే కీలకమైన పత్రాలు, సేవలు అందించనున్నారు.

కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ప్రమాణ పత్రం. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఈసీ కాపీలు, పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ పౌర సేవలు, ఇతర ముఖ్యమైన అప్లికేషన్లు అందించనున్నట్టుగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు.

ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందుకోసం 70 మందికి పైగా మీ సేవ ఏజెంట్లు, విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రెన్యూర్లకు ప్రత్యేక శిక్షణనిచ్చినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

ఈ పథకాన్ని ప్రాథమికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా స్పందనను బట్టి ఈ డోర్ డెలివరీ సర్వీసులను తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ నూతన విధానం వల్ల వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యోగులకు తీవ్ర శ్రమ తగ్గడమే కాకుండా పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.

'గుడ్ గవర్నెన్స్‌కు టెక్నాలజీని జోడించి డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. పాలనకు టెక్నాలజీని జోడించి పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలనకు పెద్దపీట వేస్తున్నాం. మీ సేవా కేంద్రాల ద్వారా అందించే అన్న ముఖ్యమైన పౌర సేవలను ఇంటి దగ్గరే అందించేందుకు ఈరోజు బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో మీ సేవా డోర్ డెలివరీ సర్వీసెస్‌ను లాంఛనంగా ప్రారంభించాను. ఈ సేవలను తొలి దశలో క్యూర్ ఏరియాలో... ఆ తర్వాత రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.' అని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More