Zomato new fee : జొమాటో కస్టమర్లకు బిగ్ షాక్- క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే ఇకపై అదనపు బాదుడే!
కస్టమర్లకు షాక్ ఇస్తూ.. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) ఆర్డర్లపై ప్రత్యేక రుసుమును విధించడం ప్రారంభించింది. ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.
ఆన్‌లైన్ ఫుడ్ సర్వీస్ దిగ్గజం జొమాటో నుంచి కస్టమర్లకు ఊహించని, ఆశ్చర్యకరమైన షాక్ ఎదురైంది! ఇకపై డెలివరీ సమయంలో నగదు రూపంలో (క్యాష్ ఆన్ డెలివరీ - సీఓడీ) చెల్లింపులు చేస్తే అదనపు ఫీజు వసూలు చేస్తామని సంస్థ తెలిపింది. అంటే.. ఆన్‌లైన్ పేమెంట్స్ బదులు జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంటే.. అదనంగా డబ్బు ఖర్చు అవుతుందని అర్థం!

క్యాష్ ఆన్ డెలివరీకి ప్రత్యేక రుసుము..
ఆర్డర్ తీసుకెళ్లినప్పుడు డెలివరీ బాయ్‌కు నేరుగా నగదు ఇచ్చే వినియోగదారుల బిల్లులో ‘పే ఆన్ డెలివరీ ఫీజు’ పేరిట ప్రత్యేక రుసుమును జొమాటో జోడిస్తోంది. యూజర్, ఆర్డర్ విలువను బట్టి ఈ చార్జీలు మారుతున్నాయి. కస్టమర్లను డిజిటల్ లేదా ఆన్‌లైన్ పేమెంట్ల వైపు మళ్లించేందుకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
జొమాటో ప్రధాన పోటీదారు స్విగ్గీ.. ప్రస్తుతం క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లపై ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయడం లేదు.
ప్లాట్‌ఫామ్ ఫీజుల మోత!
ఫుడ్ డెలివరీ కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్ రుసుములను పదే పదే పెంచుతూ వినియోగదారులపై భారం మోపుతున్నాయి. ఈ ఏడాది మార్చిలోనే జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును 20 శాతం మేర పెంచి ఆర్డర్‌కు రూ. 12.50 నుంచి రూ. 14.90కి (జీఎస్టీ రహితంగా) చేర్చింది. దానికి పోటీగా స్విగ్గీ కూడా ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 14.99 నుంచి ఏకంగా రూ. 17.58కి పెంచేసింది. ప్లాట్‌ఫామ్ నిర్వహణ వ్యయం పెరగడమే ఇందుకు కారణమని స్విగ్గీ పేర్కొంది.
ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్ ఫీజుతో సంబంధం లేకుండా, కేవలం క్యాష్ పేమెంట్ ఎంచుకున్నందుకే జొమాటో అదనపు ఛార్జీలు వేస్తుండటంతో సామాన్య వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రసవత్తరంగా మారిన ఫుడ్ డెలివరీ పోరు!
జొమాటో, స్విగ్గీలు ఫీజుల బాదుడుపై కస్టమర్లు అసంతృప్తితో ఉన్న వేళ.. భారత ఫుడ్ డెలివరీ రంగంలోకి కొత్త దిగ్గజాలు అడుగుపెడుతున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బెంగళూరులో తన ఉద్యోగుల కోసం 'ఈట్ ఇన్' పేరుతో ఫుడ్ డెలివరీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. రెస్టారెంట్ల నుంచి కేవలం 10 శాతం నుంచి 11 శాతం కమిషన్ మాత్రమే వసూలు చేస్తూ జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీ ఇవ్వాలని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది.
మరోవైపు బైక్ టాక్సీ సంస్థ రాపిడో తన ఫుడ్ డెలివరీ సేవలను ‘ఓన్లీ’ పేరుతో విస్తరిస్తోంది. 2026 మార్చిలో ఈ సేవలను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి తెచ్చింది. అలాగే క్విక్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ ‘స్విష్’ ఇటీవల బెర్టెల్స్‌మన్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్ నేతృత్వంలో 24 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 200 కోట్లు) నిధులను సమకూర్చుకుని వేగంగా విస్తరిస్తోంది.
నూతన పోటీదారుల ప్రవేశంతో ఫుడ్ డెలివరీ మార్కెట్ సరికొత్త మలుపు తిరుగుతోంది. రెస్టారెంట్లకు తక్కువ కమిషన్లు, వేగవంతమైన డెలివరీలతో కొత్త కంపెనీలు ముందుకు వస్తుంటే, పాత కంపెనీలు ఫీజుల పెంపుతో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ పోటీ వినియోగదారులకు లబ్ధి చేకూరుస్తుందో లేక మరింత ప్రియంగా మారుతుందో చూడాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


