డెలివరీ బాయ్స్ రెస్ట్ తీసుకునేందుకు ప్రగతి సెంటర్స్.. మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, వాష్‌రూమ్‌లు!
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా డెలివరీ సేవలు అందించే గిగ్ వర్కర్ల కోసం ప్రగతి కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. ఈ సెంటర్లలో డెలివరీ బాయ్స్ కోసం అనేక సదుపాయాలు ఉంటాయి.
హైదరాబాద్ నగరంలో రాత్రింబవళ్లు శ్రమిస్తూ నగర ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములవుతున్న గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల (డెలివరీ బాయ్స్) కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెలివరీ భాగస్వాములు విశ్రాంతి తీసుకోవడానికి, ప్రాథమిక వసతులు పొందడానికి వీలుగా నగరంలో ‘ప్రగతి కేంద్రాలను’ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం,ఆన్‌లైన్ గ్రోసరీ డెలివరీ యాప్ జెప్టోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

రోజంతా రోడ్లపై తిరుగుతూ సేవలందించే డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న మౌలిక వసతుల లేమిని అధిగమించేందుకు ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. 2024లో హైదరాబాద్‌లోని 166 మంది గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులపై హీట్‌వాచ్ నిర్వహించిన సర్వే సంచలన విషయాలను వెల్లడించింది.
నగరంలో దాదాపు 69 శాతం మంది గిగ్ వర్కర్లకు పరిశుభ్రమైన టాయిలెట్స్ సౌకర్యం అందుబాటులో లేదు. 80 శాతానికి పైగా కార్మికులకు తీవ్రమైన ఎండ, వర్షం నుంచి ఉపశమనం పొందేందుకు సరైన నీడ లేదా విశ్రాంతి స్థలాలు, కూలింగ్ సౌకర్యాలు లేవని తేలింది. ఈ గణాంకాలు గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న మానవీయ, ఆరోగ్య సమస్యల తీవ్రతను స్పష్టంగా చూపుతున్నాయి.
ఈ కేంద్రాలు కేవలం ఒక నిర్దిష్ట కంపెనీకి చెందిన వారి కోసమే కాకుండా, ప్లాట్‌ఫామ్‌తో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటాయి. క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ (స్విగ్గీ, జొమాటో వంటివి), ఈ-కామర్స్ (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్), దుస్తుల సరఫరా, ఇతర లాస్ట్-మైల్ డెలివరీ నెట్‌వర్క్‌లలో పనిచేసే కార్మికులందరూ ఉచితంగా వీటిని వినియోగించుకోవచ్చు. అందుబాటులో ఉండే సదుపాయాలు చూసుకుంటే.. మంచినీరు, విశ్రాంతి తీసుకోవడానికి కూలింగ్ ఏరియా, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, పరిశుభ్రమైన వాష్‌రూమ్‌లు వంటి అత్యవసర వసతులను ఇక్కడ కల్పిస్తారు.
మహానగర ప్రాంత, పట్టణాభివృద్ధి శాఖ (HMDA పరిధి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థలో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. 'ప్రాజెక్ట్ ప్రగతి ద్వారా కార్మికుల దైనందిన ఆచరణాత్మక అవసరాలను తీర్చే సురక్షితమైన ప్రదేశాలను అందుబాటులోకి తెస్తున్నాం. ఏ సంస్థలో పనిచేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ప్రతి కార్మికుడికి ఈ కేంద్రాలు స్వాగతం పలుకుతాయి.' అని ఆయన పేర్కొన్నారు.
నగర అభివృద్ధిలో గిగ్ వర్కర్ల పాత్ర ఎంతో ముఖ్యమైనదని జయేశ్ రంజన్ అన్నారు. రోజంతా రోడ్లపై తిరుగుతూ పని చేసే కార్మికుల కోసం నగరంలో మౌలిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ కామర్స్ సంస్థలు, ఆన్‌లైన్ డెలివరీ సంస్థలతో ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు.
నగరం క్రమంగా విస్తరిస్తున్న తరుణంలో, మారుతున్న కాలానికి అనుగుణంగా గిగ్ వర్కర్ల సంక్షేమానికి ఇలాంటి ప్రభుత్వ రవాణా, పట్టణ మౌలిక వసతుల ఆధారిత ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


