TG MJPTBCWREIS Results 2026 : రాష్ట్రంలోన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంస్థ (MJPTBCWREIS) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితాను బుధవారం (జూన్ 3) విడుదల చేశారు. ఈ మేరకు సొసైటీ ఇన్ ఛార్జ్ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
వెబ్‌సైట్‌లో ఫలితాల వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఫలితాలను సొసైటీ అధికారిక వెబ్‌సైట్లలో పరిశీలించుకోవచ్చు. అభ్యర్థులు https://tgcet.cgg.gov.in/TGCETWEB/#/home లేదా https://mjptbcwreis.telangana.gov.in లింకుల ద్వారా తమ సెలక్షన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చని కార్యదర్శి సూచించారు.
ఫోన్ ద్వారా సమాచారం.. జూన్ 5 నుంచి ప్రవేశాలు
ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపి, మెరిట్ ఆధారంగా రెండో విడతలో సీటు సాధించిన విద్యార్థులకు సంబంధిత గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. విద్యార్థులు ఏ తేదీన పాఠశాలకు హాజరై అడ్మిషన్ తీసుకోవాలనే పూర్తి వివరాలను ఫోన్ కాల్‌లోనే తెలియజేస్తారని డాక్టర్ మల్లయ్య భట్టు స్పష్టం చేశారు. మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన విద్యార్థులందరూ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని ఆయన కోరారు. వీరికి సీట్ల కేటాయింపు, ప్రవేశాల భర్తీ ప్రక్రియ ఈ నెల 5వ తేదీ (జూన్ 5) నుంచి ప్రారంభం కానుంది.
ఇంటర్ విద్యార్థులకు రేపే గడువు
బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో మొదటి విడత (ఫస్ట్ లిస్ట్) లో సీట్లు సాధించిన విద్యార్థులకు కూడా అధికారులు కీలక అలర్ట్ ఇచ్చారు. సీట్లు వచ్చిన అభ్యర్థులు ఈ నెల 4వ తేదీ (గురువారం) లోగా తమకు కేటాయించిన కాలేజీల్లో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా రిపోర్ట్ చేయని విద్యార్థులు తమ సీటును కోల్పోయే అవకాశం ఉందని, కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి త్వరపడాలని డాక్టర్ మల్లయ్య భట్టు స్పష్టం చేశారు.