ట్రాఫిక్ చలాన్ పడిన వెంటనే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి

ట్రాఫిక్ చలాన్ పడిన వెంటనే బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యేలా బ్యాంకులతో సమన్వయం చేసుకునే ప్రణాళికలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేయాలన్నారు.

Published on: Jan 12, 2026, 21:59:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో Arrive Alive రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ట్రాఫిక్ నియంత్రణ విషయంలో ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని సూచించారు.

Arrive Alive రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
Arrive Alive రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం, సిగ్నల్ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం, రవాణా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ నొక్కి చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన ఎజెండాగా విధివిధానాలతో నూతన చట్టం తీసుకురావలసిన అవసరం ఉందని చెప్పారు.

'ఒకప్పుడు శాంతి భద్రతలు ప్రధాన సమస్యగా ఉండేది. ఇప్పుడు ట్రాఫిక్ నియంత్రణ అతిపెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాల్సిన అవసరం ఉంది. రోడ్డు భద్రత కోసం డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ట్రాఫిక్ నియంత్రణ కోసం గూగుల్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నాం. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసుకోవడమే కాకుండా ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకుని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.' అని రేవంత్ రెడ్డి చెప్పారు.

దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి. ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణాన్ని కోల్పోవడం దురదృష్ణకరమని, రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యార్థి దశలోనే ఒక అవగాహన కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయని చెప్పారు. డ్రైవింగ్ చేసేప్పుడు మనం తప్పు చేయకపోయినా, ఎదుటివారి తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని సీఎం గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాలను ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా చేసిన హత్యలుగా భావించాలన్నారు.

'సైబర్ క్రైమ్ పెరిగిన నేపథ్యంలో నియంత్రించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టు, తీవ్రవాదాన్ని అణిచివేయడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ లాంటి సంస్థలను, టెర్రరిస్టు, మిలిటెంట్ కార్యక్రమాలను నియంత్రించడానికి గ్రేహౌండ్స్ వ్యవస్థలను ప్రారంభించి దేశానికి ఆదర్శంగా నిలిచాం. మాదకద్రవ్యాలను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకున్నాం. అలాగే చెరువులు, కుంటల కబ్జాలను నివారించడానికి హైడ్రాను ఏర్పాటు చేసుకున్నాం. అదే తరహాలో ఇప్పుడు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.' అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మైనర్లు వాహనాలు నడపడం, డ్రంకెన్ డ్రైవ్‌ చేసేవారిని నియంత్రించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఉల్లంఘనలపై చలాన్లు వేస్తున్నారని, మళ్లీ వాటిని కట్టడానికి ఆఫర్లు ఇస్తున్నారని గుర్తుచేశారు. చలాన్లు పడిన తర్వాత వారి బ్యాంక్ అకౌంట్లతో వాహనాలను అనుసంధానం చేయాలని, చలాన్ పడిన వెంటనే బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యేలా బ్యాంకులతో సమన్వయం చేసుకునే ప్రణాళికలు చేయాలని సూచించారు.

పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేయాలన్న రేవంత్ రెడ్డి.. ఇలాంటి వాటిని నివారించడానికి చిన్నతనం నుంచి అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు భద్రతపై ఒక అహగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికను రూపొందించడాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పోలీసు శాఖను అభినందించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ప్రజా ప్రతినిధులు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి సీవీ ఆనంద్, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More