తెలంగాణలో వాతావరణ పరిశీలన వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత వాతావరణ శాఖ(IMD) సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మిషన్ మౌసమ్' (Mission Mausam) ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ మౌలిక సదుపాయాలను విస్తరించాలని యోచిస్తోంది.

ఈ ప్రణాళికల ప్రకారం.. తెలంగాణలో కొత్త పరిశీలన కేంద్రాలు, డాప్లర్ వాతావరణ రాడార్లు, విండ్ ప్రొఫైలర్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పడుతుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం తెలంగాణకు అదనంగా మరో రెండు డాప్లర్ వాతావరణ రాడార్లు రానున్నాయి. వీటిలో ఒకదానిని నిజామాబాద్ సమీపంలో, మరొకదానిని హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటితోపాటు వాతావరణ అంచనాలను, గాలి వేగాన్ని మరింత కచ్చితంగా అంచనా వేయడానికి 'విండ్ ప్రొఫైలర్లను' కూడా ప్రవేశపెట్టనున్నారు.
ప్రస్తుతం తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS)తో పోలిస్తే ఐఎండీ నెట్‌వర్క్ కొంత పరిమితంగానే ఉంది. టీజీడీపీఎస్ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల నుంచి ఉష్ణోగ్రత వివరాలను అందిస్తుండగా.. ఐఎండీ ప్రస్తుతం కేవలం 12 ప్రాంతాల నుంచి మాత్రమే ఉష్ణోగ్రత రీడింగులను సేకరిస్తోంది.
తెలంగాణలో ఎండ తీవ్రతపై చర్చ జరుగుతున్న ప్రతిసారీ ఒకే రోజున ఐఎండీ, టీజీడీపీఎస్ ప్రకటించే గరిష్ట ఉష్ణోగ్రతల్లో తేడాలు ఎందుకు ఉంటున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది. టీజీడీపీఎస్ అనేక ఆటోమేటెడ్ వాతావరణ కేంద్రాలు భవనాల పైకప్పులపై ఉన్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కాంక్రీట్ కట్టడాలు వేడిని పీల్చుకుని తిరిగి పరావర్తనం చేస్తాయి. ఆ వేడిని కూడా సెన్సార్లు రికార్డు చేయడం వల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా చూపిస్తుంది.
ఐఎండీ అంతర్జాతీయ వాతావరణ నిబంధనలను అనుసరిస్తుంది. కృత్రిమ వేడి ప్రభావం పడకుండా ఉండేందుకు భూమి ఉపరితలానికి దాదాపు 2.5 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉష్ణోగ్రత సెన్సార్లను ఏర్పాటు చేస్తుంది. టీజీడీపీఎస్ ఎక్కువగా ఆటోమేటెడ్ అబ్జర్వేటరీలపై ఆధారపడుతుంది. కానీ ఐఎండీ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం క్రమం తప్పకుండా కాలిబ్రేషన్, నిర్వహణ, మాన్యువల్ తనిఖీలను నిర్వహిస్తుంది. ఈ పరికరాల నాణ్యత, ధరల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది.
ఈ మౌలిక సదుపాయాల విస్తరణతో భవిష్యత్తులో తెలంగాణలో వాతావరణ ముందస్తు హెచ్చరికలు మరింత ఖచ్చితంగా అందే అవకాశం ఉంది. మరింత కచ్చితత్వంతో వాతావరణం అప్డేట్ రానుంది.
{{/usCountry}}ఈ మౌలిక సదుపాయాల విస్తరణతో భవిష్యత్తులో తెలంగాణలో వాతావరణ ముందస్తు హెచ్చరికలు మరింత ఖచ్చితంగా అందే అవకాశం ఉంది. మరింత కచ్చితత్వంతో వాతావరణం అప్డేట్ రానుంది.
{{/usCountry}}