తెలంగాణలో మరింత కచ్చితత్వంతో వాతావరణం అప్డేట్.. ఈ ప్రాంతాల్లో కొత్తగా డాప్లర్ రాడార్లు!

తెలంగాణలో మరింత కచ్చితత్వంతో వాతావరణం అప్డేట్ రానుంది. ఇందుకోసం భారత వాతావరణ శాఖ చర్యలు తీసుకుంటోంది. కొత్తగా డాప్లర్ రాడార్లను ఏర్పాటు చేయనుంది.

Updated on: May 25, 2026, 14:31:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో వాతావరణ పరిశీలన వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత వాతావరణ శాఖ(IMD) సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మిషన్ మౌసమ్' (Mission Mausam) ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ మౌలిక సదుపాయాలను విస్తరించాలని యోచిస్తోంది.

తెలంగాణలో కొత్తగా రెండు డాప్లర్ రాడార్లు!
తెలంగాణలో కొత్తగా రెండు డాప్లర్ రాడార్లు!

ఈ ప్రణాళికల ప్రకారం.. తెలంగాణలో కొత్త పరిశీలన కేంద్రాలు, డాప్లర్ వాతావరణ రాడార్లు, విండ్ ప్రొఫైలర్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పడుతుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం తెలంగాణకు అదనంగా మరో రెండు డాప్లర్ వాతావరణ రాడార్లు రానున్నాయి. వీటిలో ఒకదానిని నిజామాబాద్ సమీపంలో, మరొకదానిని హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటితోపాటు వాతావరణ అంచనాలను, గాలి వేగాన్ని మరింత కచ్చితంగా అంచనా వేయడానికి 'విండ్ ప్రొఫైలర్లను' కూడా ప్రవేశపెట్టనున్నారు.

ప్రస్తుతం తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS)తో పోలిస్తే ఐఎండీ నెట్‌వర్క్ కొంత పరిమితంగానే ఉంది. టీజీడీపీఎస్ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల నుంచి ఉష్ణోగ్రత వివరాలను అందిస్తుండగా.. ఐఎండీ ప్రస్తుతం కేవలం 12 ప్రాంతాల నుంచి మాత్రమే ఉష్ణోగ్రత రీడింగులను సేకరిస్తోంది.

తెలంగాణలో ఎండ తీవ్రతపై చర్చ జరుగుతున్న ప్రతిసారీ ఒకే రోజున ఐఎండీ, టీజీడీపీఎస్ ప్రకటించే గరిష్ట ఉష్ణోగ్రతల్లో తేడాలు ఎందుకు ఉంటున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది. టీజీడీపీఎస్ అనేక ఆటోమేటెడ్ వాతావరణ కేంద్రాలు భవనాల పైకప్పులపై ఉన్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కాంక్రీట్ కట్టడాలు వేడిని పీల్చుకుని తిరిగి పరావర్తనం చేస్తాయి. ఆ వేడిని కూడా సెన్సార్లు రికార్డు చేయడం వల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా చూపిస్తుంది.

ఐఎండీ అంతర్జాతీయ వాతావరణ నిబంధనలను అనుసరిస్తుంది. కృత్రిమ వేడి ప్రభావం పడకుండా ఉండేందుకు భూమి ఉపరితలానికి దాదాపు 2.5 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉష్ణోగ్రత సెన్సార్లను ఏర్పాటు చేస్తుంది. టీజీడీపీఎస్ ఎక్కువగా ఆటోమేటెడ్ అబ్జర్వేటరీలపై ఆధారపడుతుంది. కానీ ఐఎండీ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం క్రమం తప్పకుండా కాలిబ్రేషన్, నిర్వహణ, మాన్యువల్ తనిఖీలను నిర్వహిస్తుంది. ఈ పరికరాల నాణ్యత, ధరల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది.

ఈ మౌలిక సదుపాయాల విస్తరణతో భవిష్యత్తులో తెలంగాణలో వాతావరణ ముందస్తు హెచ్చరికలు మరింత ఖచ్చితంగా అందే అవకాశం ఉంది. మరింత కచ్చితత్వంతో వాతావరణం అప్డేట్ రానుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More