TG Muncipal Elections : కుర్చీ ఎవరిదో…? నేడే మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక - పలుచోట్ల ఉత్కంఠ…!

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతాయి. పార్టీల బలాలను బట్టి మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికను పూర్తి చేయనున్నారు. పలుచోట్ల హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Published on: Feb 16, 2026, 06:26:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ పాగా వేయగా… మరికొన్నిచోట్ల బీఆర్ఎస్ కూడా గెలిచింది. మరోవైపు బీజేపీ, ఎంఐఎం కూడా కొన్ని ప్రాంతాల్లో సత్తా చాటగా…. ఈసారి స్వతంత్రులు కూడా ఎక్కువగానే గెలిచారు. అయితే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఇవాళ కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్ోతంది.

కుర్చీ ఎవరిదో…? నేడే మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక - పలుచోట్ల ఉత్కంఠ…!
కుర్చీ ఎవరిదో…? నేడే మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక - పలుచోట్ల ఉత్కంఠ…!

నేడే ప్రమాణస్వీకారం…

మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు సంబంధించి నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత కీలమైన మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతోపాటు ఎక్స్‌ అఫీషియో సభ్యుల ఓట్లను కలుపుకొని ఈ ఎన్నిక ప్రక్రియ చేపడతారు. ఆ తర్వాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇందుకు అనుగుణంగా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన ఏర్పాట్లు చేశారు.

కాకపుట్టిన హంగ్…!

మెజార్టీలు వార్డులు లేదా డివిజన్లు గెలిచి మ్యాజిక్ ఫిగర్ దాటిన చోట చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నిక సాఫీగానే పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ హంగ్ వచ్చిన చోటే తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపిన ఆయా పార్టీలు…. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు క్యాంపుల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు తరలిచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై అందరి చూపు ఉంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఇక్కడ అవతరించింది. కానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు. దీంతో అధికార కాంగ్రెస్.. ఎట్టిపరిస్థితిల్లోనూ తగ్గేది లేదని డిసైడ్ అయింది. ఇక్కడ జెండా ఎగురవేసేందుకు పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఉత్కంఠభరితంగా మారింది. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటి నెలకొంది.

కరీంనగర్ లో మొత్తం 66 డివిజన్లలో అత్యధికంగా 30 డివిజన్లను బీజేపీ గెలుచుకున్నప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై కూర్చోవాలంటే అవసరమైన సంఖ్యా బలం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 డివిజన్లను గెలుచుకున్నాయి. మిగిలిన 10 డివిజన్లు స్వతంత్ర అభ్యర్థులకు వెళ్ళాయి. ఇప్పుడు వీరే కీలకం అయ్యారు.

నిజామాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ పదవికి ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మొత్తం 60 డివిజన్లలో 28 డివిజన్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ, మేయర్ ఎన్నికల్లో 31 అనే మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవడం బీజేపీకి కష్టతరమైన పనిగా ఉంది. 17 డివిజన్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, 14 డివిజన్లను గెలుచుకున్న AIMIM మద్దతుపై ఆధారపడుతోంది. బీఆర్ఎస్ ఒకే ఒక డివిజన్‌ను గెలుచుకుంది. గెలిచిన వ్యక్తి కూడా కాంగ్రెస్‌లో చేరాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

కొత్తగూడెం మేయర్‌ పదవీకాలాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవడానికి కాంగ్రెస్, సీపీఐ ఒప్పందం చేసుకున్నాయి. ఇక్కడ దాదాపుగా ఎలాంటి ఇబ్బందులు రాకపోవచ్చని తెలుస్తోంది.ఇక మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ - సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. బలం బీఆర్ఎస్ వైపు ఉండగా… క్యాతనపల్లి చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేస్తోంది.

మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ 13, బీఆర్ఎస్ 11 చోట్ల గెలవడంతో హంగ్‌ ఏర్పడింది. అయితే ఎక్స్ ఆఫీషియో ఓట్లతో పాటు స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాట్లు చేశారు. ఒకవేళ ఎక్కడైనా ఎన్నిక వాయిదా పడితే తిరిగి ఈనెల 17వ తేదీన చేపట్టే అవకాశం ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More