నల్గొండలో ఆ నలుగురిది సూసైడ్ కాదు.. దారుణంగా చంపేసిన సుపారీ గ్యాంగ్!

నల్గొండలో ఇటీవల నలుగురి మృతదేహాలు అనుమానాస్పదస్థితిలో కనిపించాయి. ఒకే ఇంట్లో నలుగురి మృతదేహాలు ఉండటంతో ఇది ఆత్మహత్య అనుకున్నారు. కానీ ఇది హత్య అని పోలీసులు తేల్చారు.

Updated on: Jun 25, 2026, 12:21:45 IST
By , Nalgonda
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జూన్ 22న వెలుగుచూసిన ఈ దారుణాన్ని తొలుత అందరూ ఆత్మహత్యగానే భావించారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించగా.. ఇది ఆత్మహత్య కాదు, అత్యంత క్రూరంగా జరిగిన హత్యలు అని తేలింది.

ఒకే కుటుంబంలో నలుగురి హత్య
ఒకే కుటుంబంలో నలుగురి హత్య

ఫోరెన్సిక్ నివేదికతో కీలక మలుపు

మృతులను ప్రకాశంబజార్‌లో బ్యాగుల వ్యాపారం చేసే మహ్మద్‌ సుల్తాన్‌ (45), ఆయన భార్య హసీనా (38), కుమారుడు ముజామిల్‌ (20), కుమార్తె అఫోర (14)గా గుర్తించారు. ఘటనా స్థలంలో నిందితులు ఎలాంటి ఆధారాలు వదలకుండా జాగ్రత్త పడినప్పటికీ, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక పోలీసులకు కీలక ఆధారాలను అందించింది. పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి, ప్రణాళికాబద్ధంగా వీరిని హతమార్చినట్లు ఫోరెన్సిక్ నివేదికలో స్పష్టమైంది.

ఆరుగురు సుపారీ గ్యాంగ్ సభ్యుల అరెస్ట్

ఈ సామూహిక హత్యల వెనుక ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నట్లు గుర్తించిన నల్గొండ పోలీసులు తీవ్రంగా శ్రమించి నిందితులను పట్టుకున్నారు. ఈ హత్యలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఆరుగురు సభ్యుల సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో తలెత్తిన తీవ్రమైన అంతర్గత గొడవలు, విలువైన ఆస్తి తగాదాలే ఈ ఘాతుకానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.

కుటుంబంలో కలహాలు

స్థానికుల కథనం ప్రకారం.. వ్యాపారి అయిన సుల్తాన్‌కు గతంలోనే మొదటి భార్య మరణించగా, హసీనాతో రెండో వివాహం జరిగింది. మరణించిన ముజామిల్(ఏసీ టెక్నీషియన్), అఫోర (7వ తరగతి విద్యార్థిని) ఇద్దరూ సుల్తాన్ మొదటి భార్య పిల్లలు. హసీనా ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. అయితే గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య తీవ్రమైన మనస్పర్థలు నడుస్తున్నాయి. సుల్తాన్ తరచూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవపడేవారని సమాచారం.

కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆస్తిని దక్కించుకోవడానికో లేదా పాత కక్షల కారణంచేతో ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి మరీ ఈ నలుగురిని అంతమొందించినట్లు తెలుస్తోంది. నిందితులను త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెట్టి, పూర్తి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More