దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు - రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం..! అనుమానితుడి విచారణ
ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లపై సైబర్ దాడులకు పాల్పడిన కేసులో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. తెలంగాణలోని రామగుండంతో పాటు దేశవ్యాప్తంగా 5 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా… కీలక ఆధారాలు స్వాధీనం చేసుకుంది.
భారత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు తెగబడిన ముఠాల గుట్టు రట్టు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వేగం పెంచింది. 'ఆపరేషన్ సింధూర్' సమయంలో దేశ భద్రతకు అత్యంత కీలకమైన డిజిటల్ నెట్‌వర్క్‌పై దాడులకు యత్నించిన కేసులో ఎన్ఐఏ అధికారులు సోమవారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఈ సోదాలు మొత్తం ఐదు కీలక ప్రాంతాల్లో సాగాయి. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండంతో పాటు మహారాష్ట్రలోని పుణే (జున్నార్), గుజరాత్‌లోని ఖేడా (నాడియాడ్), బీహార్‌లోని గోపాల్‌గంజ్, దేశ రాజధాని ఢిల్లీలలో ఎన్ఐఏ బృందాలు ఒకేసారి రంగంలోకి దిగాయి.
ఆపరేషన్ సింధూర్ ఏంటి…?
గత ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఉన్న బైసారన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు ఘాతకానికి ఒడిగట్టారు. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు మూకలు 25 మంది పర్యాటకులను, ఒక స్థానిక గుర్రపు స్వారీ నిర్వాహకుడిని అత్యంత దారుణంగా కాల్చి చంపారు.
ఈ దారుణ ఉగ్రదాడికి నిరసనగా, భారత సాయుధ దళాలు గత ఏడాది మే 7న తీవ్రస్థాయిలో తిప్పికొట్టాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా నిశిత దాడులు నిర్వహించాయి. ఈ సైనిక చర్యకే 'ఆపరేషన్ సింధూర్' అని నామకరణం చేశారు.
ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే, మన దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను దెబ్బతీసేందుకు కొందరు ఉగ్ర సానుభూతిపరులు కుట్ర పన్నారు. దేశంలోని 54 ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్‌లు, సంక్లిష్టమైన కంప్యూటర్ వనరులు, క్లిష్టమైన సమాచార మౌలిక సదుపాయాలను స్తంభింపజేయడానికి 'డిస్ట్రిబ్యూటెడ్ డినైయల్ ఆఫ్ సర్వీస్' విధానంలో భారీ సైబర్ దాడులకు ప్రయత్నించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఎన్ఐఏ వెల్లడించింది.
గత ఏడాది జూన్ 25న నమోదు చేసిన ఈ కేసును మొదట గుజరాత్ పోలీసులు విచారించారు. అనంతరం కేసు తీవ్రత దృష్ట్యా ఎన్ఐఏకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
డిజిటల్ సాక్ష్యాల స్వాధీనం
సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన ఎన్‌ఐఏ…. అరెస్టయిన నిందితులకు దాడుల నైపుణ్యాలు నేర్పించడంలో, వారికి కావాల్సిన సాంకేతిక సహకారం అందించడంలో కొందరు వ్యక్తులు సహాయపడినట్లు గుర్తించింది. న్యాయస్థానం అనుమతితో సోమవారం ఉదయం సదరు అనుమానితుల ఇళ్లపై దాడులు చేసింది.
ఈ సోదాల్లో హ్యాకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన అనేక డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురి ల్యాప్‌టాప్‌లు, ఐదు మొబైల్ ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లతో పాటు ఇతర సాంకేతిక పరికరాలను సీజ్ చేశారు. విచారణలో భాగంగా ఈ అనుమానితులను ఇప్పటికే జైలులో ఉన్న ప్రధాన నిందితులతో ఉన్న సంబంధాలపై సుదీర్ఘంగా ప్రశ్నించారు.
ఇక తెలంగాణకు చెందిన రామగుండంలోని స్థానిక అయోధ్యనగర్ ప్రాంతంలో దాడులు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు… ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే స్థానిక ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఉగ్రవాద సంస్థలతో, ముఖ్యంగా అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో ఇతడికి ఉన్న సంబంధాలపై ఎన్‌ఐఏ బృందాలు తీవ్రంగా ఆరా తీస్తున్నాయి. సైబర్ దాడులకు పాల్పడిన ముఠాకు సదరు యువకుడు ఎలాంటి సాంకేతిక సహకారం అందించాడు? కోడింగ్, హ్యాకింగ్ నైపుణ్యాలను ఎలా సమకూర్చాడు? అనే అంశాలపై అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అరెస్టయిన నిందితులతో ఉన్న పరిచయాలు, అతడు నిర్వహించిన డిజిటల్ లావాదేవీలను కూడా దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా అతడి వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

