ఈశాన్య రుతుపవనాలు : 12 జిల్లాల్లో చుక్క వానలేదు.. 95 శాతం వర్షపాతం లోటు

తెలంగాణలో ఈశాన్య రుతుపవనాలతోనూ వరుణదేవుడు కనికరించలేదు. వర్షపాతం లోటు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్టోబర్‌లో 12 జిల్లాల్లో చక్క వాన కూడా పడలేదు.

Published on: Oct 22, 2026, 14:52:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల(North East Monsoon) సీజన్ అత్యంత పొడిగా ప్రారంభమైంది. ఈశాన్య రుతుపవనాల కాలంలో ఎప్పుడూ కురిసే సగటు వర్షపాతంతో పోలిస్తే ఈసారి తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు తెలంగాణలోని పలు జిల్లాల్లో సాధారణం కంటే అత్యల్ప వర్షపాతం నమోదవ్వడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం
తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం

సాధారణంగా తెలంగాణలో అక్టోబర్ నెల అత్యధికంగా వర్షాలు కురిసే నెలల్లో ఒకటి. అయితే ఈ ఏడాది అక్టోబర్ తొలి 21 రోజుల్లో సాధారణం కంటే విపరీతంగా వర్షపాతం పడిపోయింది. రాష్ట్ర సగటు వర్షపాతం చూసుకుంటే.. అక్టోబర్ 1 నుండి 21 వరకు రాష్ట్రంలో సాధారణంగా 75.6 మిమీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 3.5 మిమీ మాత్రమే నమోదైంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 95 శాతం వర్షపాత లోటు నెలకొంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నగరంలో సాధారణంగా అక్టోబర్ నెలలో 114 మిమీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ నెల 21వ తేదీ వరకు కేవలం 2.8 మిమీ వర్షం మాత్రమే కురిసింది. దీంతో నగరంలో 97 శాతం వర్షపాత లోటు నమోదైంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. అక్టోబర్ 2020లో హైదరాబాద్ నగరంలో ఏకంగా 400.7 మిమీ వర్షపాతం నమోదు కాగా, 2016 అక్టోబర్‌లో 37.1 మిమీ వర్షపాతం నమోదైంది. కానీ ఈసారి పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారింది.

రాష్ట్రంలోని దాదాపు 12 జిల్లాల్లో అక్టోబర్ మొదటి 21 రోజుల్లో చుక్క వర్షం కూడా పడలేదు. హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, మేడ్చల్-మల్కాజిగిరి, మంచిర్యాల, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేటలో వానలు లేవు.

అక్టోబర్ నెలలో రాష్ట్రంలోనే అత్యధికంగా వనపర్తి జిల్లాలో 17.7 మిమీ వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ ఇది సాధారణ వర్షపాతం (82.1 మిమీ) కంటే 78 శాతం తక్కువ కావడం గమనార్హం. సాధారణంగా నమోదు కావాల్సిన 94.6 మిమీ వర్షపాతానికి గాను ఖమ్మంలో కేవలం 13.8 మిమీ వర్షపాతం మాత్రమే పడింది. యాదాద్రి భువనగిరిలో సాధారణంగా పడాల్సిన 84.6 మిమీకి గాను కేవలం 13 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది.

తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో ఈశాన్య రుతుపవనాల సమయంలో వర్షపాతం ఈ స్థాయిలో తగ్గిపోవడానికి ఎల్ నినో ప్రభావమే ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఒక సహజ వాతావరణ దృగ్విషయం. నీరు అసాధారణంగా వేడెక్కే ఒక వాతావరణ ప్రక్రియ. సముద్రపు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొన్ని డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయి. దీనివల్ల వాతావరణ ప్రసరణ విధానంలో మార్పులు వచ్చి, ప్రపంచవ్యాప్తంగా వర్షపాత సరళి పూర్తిగా మారిపోతుంది.

ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తున్న పొడి వాతావరణానికి, వర్షాలు తగ్గడానికి ఈ ఎల్ నినో ప్రభావమే కారణం. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంతో పాటు తాగునీటి సరఫరాపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More