అన్నారం బ్యారేజీలో ఇసుక తవ్వకాలు - అధికారులు ఏం చెప్పారంటే..?

అన్నారం బ్యారేజీ వద్ద అక్రమ ఇసుక తవ్వకాలని వచ్చిన వార్తలను అధికారులు ఖండించారు. సామాజిక మాధ్యమాలలో కొన్ని అకౌంట్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు పూర్తి వివరాలను తెలిపారు.

Published on: Mar 03, 2026 6:35 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అన్నారం బ్యారేజీ వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో కొన్ని అకౌంట్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే విషయంపై మహాదేవ్ పూర్ డివిజన్ నెంబర్ 2కి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేశ్ బాబు పూర్తి వివరణ ఇచ్చారు.

అన్నారం బ్యారేజీ
అన్నారం బ్యారేజీ

ప్రస్తుతం జరుగుతున్న ఇసుక తొలగింపు కార్యక్రమం…. అధికారులు సిఫార్సు మేరకు శాస్త్రీయ పరిశోధనా నిమిత్తం మాత్రమే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఏప్రిల్ 24, 2025 నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన తుది నివేదిక ప్రకారం…. బ్యారేజీకు సంబంధించి సాంకేతిక పరిశోధన చెయ్యాలని సిఫార్సు ఉంది. దీని ప్రకారం… నీటిపారుదల శాఖ భారత ప్రభుత్వ ప్రధాన సంస్థ అయిన పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS)ను సంప్రదించింది. జనవరి 2026 లో CWPRS నిపుణులు, బ్యారేజీ స్థలాన్ని సందర్శించి, అక్కడ పరిస్థితులు, దర్యాప్తు సాధ్యమవుతుందా లేదా అనే విషయాన్ని అంచనా వేశారు. ఈ దర్యాప్తు, రాబోయే వర్షాకాలం ముందు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఏ విధంగా దర్యాప్తు చేస్తారు?

  • కట్టడాన్ని పాడుచేయకుండా చేసే పరీక్షలు నిర్వహించడం (UPV & రీబౌండ్ హామర్ పరీక్షలు)
  • కాంక్రీట్ ముక్కను తీసి బలాన్ని పరీక్షించడం
  • భూగర్భ స్కానింగ్ పరీక్షలు
  • స్థంబాలు - బ్యారేజీ తనిఖీ

CWPRS సూచనలేంటి..?

  • బ్యారేజ్ పై ఎటువంటి ఇసుక, నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి.
  • కాంక్రీటు పైభాగం స్పష్టంగా కనిపించాలి.
  • కొలతలు తీసుకోవడానికి, గుర్తులు పెట్టడానికి, పరీక్షలు చేయడానికి అడ్డంకులు ఉండకూడదు.
  • కాబట్టి ఈ పరీక్షలు చేయడానికి అడ్డంగా ఉన్న ఇసుకను తీసివేయడం తప్పనిసరి అని సూచించింది.

కేవలం పరీక్షల కోసం మాత్రమే….

గత కొంత కాలంగా, బ్యారేజీ దగ్గర భారీగా ఇసుక పేరుకుపోయింది. ముఖ్యంగా బ్యారేజీకి ముందు వైపు (నీళ్లు వచ్చే వైపు), బ్యారేజీకి వెనుక వైపు (నీళ్లు వెళ్లే వైపు), గేట్ల మధ్య భాగంలో ఇసుకు ఎక్కువగా ఉందని రమేశ్ బాబు పేర్కొన్నారు. ఈ ఇసుకను తీయకపోతే…. కట్టడం ఎలా ఉందో తనిఖీ చేయలేరని వివరించారు. కొలతలు తీసుకోలేరని… సైంటిఫిక్ టెస్టులు చేయడం కుదరదన్నారు. కేవలం పరిశోధనా నిమిత్తం…. ఎంత మేరకు అవసరమో, అంత ఇసుకను మాత్రమే తీస్తున్నారని స్పష్టం చేశారు.

అన్నారం బ్యారేజీ దగ్గర అక్రమ ఇసుక తవ్వకాలు జరగడం లేదని తెలిపారు. కేవలం పరీక్షలు చేసే చోట మాత్రమే ఇసుక తీస్తున్నారని… నిపుణుల కమిటీ (NDSA) సూచనల ప్రకారమే పని జరుగుతోందని పేర్కొన్నారు. కుట్ర లేదా కూల్చివేత అని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదుని… అవి కేవలం పుకార్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం జరుగుతున్న ఇసుక తొలగింపు పని… నేషనల్ అథారిటీ నిపుణులు ఇచ్చిన సిఫార్సు మేరకు జరుగుతుందని రమేశ్ బాబు తన ప్రకటనలో తెలిపారు. ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణలో జరుగుతోందని… నిర్ణీత లోతు వరకే ఇసుక తవ్వుతున్నారని స్పష్టం చేశారు. నీటి పారుదల శాఖ…. ఎల్లప్పుడూ, బ్యారేజీ భద్రతకు నిబంధనలకు కట్టుబడి పనిచేస్తోందన్నారు.