...
...
Next Story

Opinion: పట్టణ తీర్పు... ప్రజా పాలనకు మద్దతు

‘‘మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ప్రజా పాలన పట్ల ఉన్న విశ్వాసాన్ని మరొకసారి రుజువు చేశాయి. అభివృద్ధి, పారదర్శకత, సంక్షేమం అనే మూడు సూత్రాలపై ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తమ మద్దతును పునరుద్ఘాటించారు..’’ - టీపీసీసీ అధ్యక్షుడి ప్రజాసంబంధాల అధికారి నాగరాజు విశ్లేషణ.

Published on: Feb 23, 2026, 18:27:49 IST
Advertisement

ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే పరమావది. ప్రతి ఎన్నిక ప్రజల మనసులోని భావాలను వెలిబుచ్చే వేదిక. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు స్థానిక అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పుకు స్పందనగా నిలుస్తుంది. పట్టణాల్లో రహదారులు, నీటి సరఫరా, పారిశుధ్యం, మౌలిక వసతులు వంటి అంశాలపై ప్రభుత్వ పనితీరును ప్రజలు సమీక్షించే అవకాశమే ఈ ఎన్నికలు.

ఏకతాటిపై పార్టీ శ్రేణులు (@revanth_anumula X)
ఏకతాటిపై పార్టీ శ్రేణులు (@revanth_anumula X)

తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ‘ప్రజా పాలన’ పట్ల ఉన్న విశ్వాసాన్ని మరొకసారి రుజువు చేశాయి. అభివృద్ధి, పారదర్శకత, సంక్షేమం అనే మూడు సూత్రాలపై ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తమ మద్దతును పునరుద్ఘాటించారు. ఈ తీర్పు కేవలం స్థానిక సంస్థల విజయం మాత్రమే కాదు రాష్ట్ర రాజకీయ దిశను నిర్దేశించే ప్రజల స్పష్టమైన సంకేతం.

దీనిని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసానికి ప్రతీకగా చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో మాట్లాడుతూ—“2023లో నేను పీసీసీ అధ్యక్షుడిగా, మహేష్ కుమార్ గౌడ్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. 2029లో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా, నేను ముఖ్యమంత్రిగా మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం" అనే ధీమా ఇప్పుడు రాజకీయ వాస్తవంగా మారుతున్న దృశ్యంగా కనిపిస్తోంది. తాజా పురపాలక ఫలితాలు ఆ దిశగా ప్రజా మద్దతును బలంగా ప్రతిబింబించాయి.

కొనసాగిన జోష్

పంచాయతీ ఎన్నికలలోనే బంపర్ విజయాన్ని నమోదు చేసిన కాంగ్రెస్, మున్సిపల్ ఎన్నికల్లో అదే జోష్‌ను కొనసాగించింది. రాష్ట్రవ్యాప్తంగా 95 పుర నగరపాలికల మేయర్, చైర్మన్ పదవులను కైవసం చేసుకోవడం సాధారణ విషయం కాదు. కొత్తగూడెంలో మిత్రపక్షం సీపీఐతో కలిసి అధికారం పంచుకోవడం ద్వారా రాజకీయ సమన్వయాన్ని చాటుకుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇంత పెద్ద స్థాయిలో మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇది ప్రజలు ‘ప్రజా పాలన’ ప్రభుత్వంపై వ్యక్తం చేసిన విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం. గ్రామం నుంచి పట్టణం వరకు ఒకే తరహా ప్రజాభిప్రాయం వ్యక్తమవడం రాజకీయంగా గమనించదగ్గ అంశంగా పరిగణించాలి.

వ్యూహరచన, సమన్వయం

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నిజామాబాద్ నగరపాలక సంస్థ సహా పలు కీలక మున్సిపాలిటీలను తిరిగి సాధించడం వెనుక స్పష్టమైన వ్యూహం ఉంది. అభ్యర్థుల ఎంపికలో స్థానిక సమీకరణాలు, సామాజిక సమతుల్యతను పరిగణలోకి తీసుకోవడం, క్షేత్రస్థాయిలో అసంతృప్తులను ముందుగానే పరిష్కరించడం వంటి చర్యలు ఫలితాలను ప్రభావితం చేశాయి. ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ లాంటి నాయకులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పార్టీ పనితీరును మెరుగుపరిచారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత, బూత్ స్థాయి సమన్వయం, సోషల్ ఇంజినీరింగ్ వంటి అంశాలు తెలంగాణ కాంగ్రెస్‌కు విజయసూత్రంగా నిలిచాయి.

సంక్షేమ, అభివృద్ధి పథకాల దన్ను

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ–అభివృద్ధి పథకాలే ఈ విజయానికి ప్రధాన బలం. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఉపశమనం కలిగింది. రూ. 500 గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి నిర్ణయాలు మధ్యతరగతి, పేదల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకువచ్చాయి. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాలు గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వానికి మద్దతును బలోపేతం చేశాయి. సంక్షేమం కేవలం ప్రకటనల స్థాయిలో కాకుండా, లబ్ధిదారుల జీవితాల్లో వెలుగునిచ్చే మార్పుగా మారడం ఈ ఎన్నికల్లో ప్రతిఫలించింది.

వ్యవసాయ రంగంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్ వంటి హామీల అమలు రైతు వర్గం విశ్వాసాన్ని గెలుచుకుంది. రైతు సమస్యలను కేవలం హామీలతో కాకుండా కార్యాచరణతో పరిష్కరించాలనే ప్రభుత్వ దృక్పథం స్పష్టంగా కనిపించింది. యువతకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రుణాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేయడం యువతలో ఆశలను పెంచింది. మహిళా సాధికారిత దిశగా ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక బలం కల్పించడం గమనార్హం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి నిర్ణయాలు సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటుతున్నాయి.

ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రజలు

ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే బీఆర్ఎస్, బీజేపీ అవాస్తవాలతో ప్రచారంతో ఎన్నికల రంగంలోకి దిగినా ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకున్నారు. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పుల భారం, నిరుద్యోగ సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు వివాదాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ప్రజల్లో అసంతృప్తిని కలిగించాయి. మరోవైపు, కేంద్రంలో పన్నెండేళ్లుగా ఉన్న బీజేపీ తెలంగాణకు తగిన నిధులు ఇవ్వలేదనే భావన బలపడింది. విభజన హామీలు అమలు కాలేదనే విమర్శలు ఎన్నికల్లో ప్రతిఫలించాయి. ప్రజలు ప్రచారానికి కాకుండా అభివృద్ధికి ఓటు వేశారనేది స్పష్టమైంది.

రాజకీయంగా ఈ ఫలితాలు 2028 అసెంబ్లీ, 2029 పార్లమెంట్ ఎన్నికలకు మార్గసూచికగా కనిపిస్తున్నాయి. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుండగా, పుర ఎన్నికల్లోనూ ప్రజలు అభివృద్ధికి దిశగా మద్దతు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నుంచి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల వరకు కాంగ్రెస్‌కు లభిస్తున్న విజయ పరంపర పార్టీ స్థిరత్వాన్ని సూచిస్తోంది. అయితే విజయం అంతిమ గమ్యం కాదని గుర్తించి కొత్త బాధ్యతగా భావించాలి. స్థానిక సంస్థల్లో అధికారాన్ని పొందడం ద్వారా అభివృద్ధి వేగవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, పార్టీపై మరింత పెరిగింది. పారదర్శక పాలన, అవినీతి నిరోధక చర్యలు, వనరుల సమర్థ వినియోగం ఇవన్నీ కొనసాగితేనే ప్రజా విశ్వాసం దీర్ఘకాలికంగా నిలుస్తుంది.

మొత్తంగా చూస్తే, తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పుకు సంకేతంగా నిలిచాయి. ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితం మాత్రమే కాదు ప్రజల మనోభావాలకు ప్రతిబింబం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమన్వయం, పార్టీ శ్రేణుల అంకితభావం కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించాయి. ప్రజా ఆశీర్వాదాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే, ఈ విజయ పరంపర మరింత బలపడడం ఖాయం. ప్రజల విశ్వాసం అన్నది రాజకీయాల్లో అత్యంత విలువైన మూలధనం; ఆ మూలధనాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే తెలంగాణ భవిష్యత్తు మరింత దృఢంగా నిలుస్తుంది.

- అమరవాజీ నాగరాజు

టీపీసీసీ అధ్యక్షుడి చీఫ్ పీఆర్వో

- అమరవాజీ నాగరాజు

(గమనిక: ఈ వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు, వ్యూహాలు రచయితవి మాత్రమే. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు. ఏదైనా అంశంపై మీ విశ్లేషణలు, అభిప్రాయాలు తెలియపరిచేందుకు praveen.lenkala@htdigital.in కు మెయిల్ చేయగలరు.)

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe