ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్!

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి కాలేజీలు బంద్ పాటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య వెల్లడించింది. బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

Published on: Oct 26, 2025, 21:27:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బకాయిల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రభుత్వంతో పలుసార్లు సమావేశం అయింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా.. తర్వాత రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తోపాటుగా ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబర్ 3వ తేదీ నుంచి బంద్ చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేశ్ బాబు చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, లేదంటే కాలేజీలు నడిపే పరిస్థితుల్లో లేమని తెలిపారు. రూ.1200 కోట్ల బకాయిలు చెల్లిస్తామని రూ.300 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

మంత్రులు మాకు సహకరించడం లేదని రమేశ్ బాబు అన్నారు. నవంబర్ 1లోపు రూ.900 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రావాల్సిన బకాయిలపై స్పష్టత ఇవ్వాలన్నారు. నవంబర్ 1న రూ.900 కోట్ల బకాయిలు విడుదల చేయకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి నిరవధిక బంద్ పాటిస్తామన్నారు. నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. వాళ్ల స్వార్థం కోసం మమ్మల్ని భయపెడితే ఊరుకోమని, ఒక్క పోలీసును కూడా కాలేజీలోకి అనుమతించమని చెప్పారు.

ఇటీవలే బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి హామీ రావటంతో కాలేజీలు వెనక్కి తగ్గాయి. అయితే బకాయిల చెల్లింపుల విషయంలో జాప్యం నెలకొంది. బంద్‌కు సంబంధించి ప్రైవేటు కాలేజీల యాజమాన్యం కార్యాచరణను కూడా ప్రకటించింది. ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని వెంటనే బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి కాలేజీలను మూసి వేస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య స్పష్టం చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 1500కుపైగా వృత్తి విద్యా కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు ఇతర ఫీజులు కాలేజీలకు చెల్లించాల్సి ఉంది. దాదాపు రూ.10 వేల కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More