తెలంగాణ చరిత్ర పరిశోధనల్లో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదిలాబాద్ జిల్లా భీమ్సరి గ్రామంలో అత్యంత అరుదైన, చారిత్రక ‘బుద్ధ పరినిర్వాణ’ (మహా పరినిర్వాణం చెందుతూ పడుకుని ఉన్న బుద్ధుడు) శిల్పం లభ్యమైంది. ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ సభ్యులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, చరిత్ర అధ్యాపకుడు పృథ్విరాజ్ భీమ్సరి గ్రామంలో క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తుండగా ఒక రాతి స్తంభంపై ఈ శిల్పాన్ని గుర్తించారు. ఈ స్తంభానికి నాలుగు వైపులా విభిన్న శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అందులో ఒకవైపు బుద్ధ పరినిర్వాణ శిల్పం అర్ధ శిల్పంగా మలచబడి ఉంది.
ఈ శిల్పాన్ని నిశితంగా పరిశీలించిన చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ మాట్లాడుతూ... "ఈ శిల్పంలో బుద్ధుడు తన కుడిచేతిని తల కింద ఉంచుకుని, కుడివైపునకు తిరిగి పడుకుని ఉన్నాడు. ‘పరినిబ్బాన సుత్త’ గ్రంథంలో వివరించిన బుద్ధ పరినిర్వాణ రూపానికి ఇది అచ్చుగుద్దినట్లు సరిపోలింది." అని పేర్కొన్నారు.
ప్రముఖ శిల్పకారుడు, చరిత్రకారుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కూడా ఈ శిల్పాన్ని పరిశీలించి, ఇది కచ్చితంగా బుద్ధ పరినిర్వాణ శిల్పమేనని ధృవీకరించారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం... తెలంగాణలో ఇప్పటివరకు ఇలాంటి శిల్పాలు కేవలం రెండు చోట్ల మాత్రమే లభించాయి. ఒకటి వేములవాడ భీమేశ్వర ఆలయం దగ్గర ఉండగా, మరొకటి ముదిగొండలో లభించిన తెల్లటి రాతి పలకపై ఉంది. ఇప్పుడు ఆదిలాబాద్‌లో లభించడం మూడోది.
ఈ రాతి స్తంభం మిగిలిన మూడు వైపులా ఇతర మతాలకు సంబంధించిన అద్భుత శిల్పాలు ఉన్నాయి. శేషతల్పంపై పడుకుని ఉన్న విష్ణుమూర్తి, పార్వతీ దేవిని ఆలింగనం చేసుకున్న శివుడి రూపం, రాజసపు దుస్తులు ధరించి, చేతిలో కత్తి పట్టుకున్న ఒక వీరుని విగ్రహం ఉన్నాయి.
{{/usCountry}}ఈ రాతి స్తంభం మిగిలిన మూడు వైపులా ఇతర మతాలకు సంబంధించిన అద్భుత శిల్పాలు ఉన్నాయి. శేషతల్పంపై పడుకుని ఉన్న విష్ణుమూర్తి, పార్వతీ దేవిని ఆలింగనం చేసుకున్న శివుడి రూపం, రాజసపు దుస్తులు ధరించి, చేతిలో కత్తి పట్టుకున్న ఒక వీరుని విగ్రహం ఉన్నాయి.
{{/usCountry}}ఒకే రాతి స్తంభంపై బౌద్ధ, శైవ, వైష్ణవ సంస్కృతులకు సంబంధించిన శిల్పాలు చెక్కబడి ఉండటం అత్యంత అరుదైన విషయమని, నాటి కాలంలోని మత సామరస్యానికి ఇది సజీవ సాక్ష్యమని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆవిష్కరణ తెలంగాణ బౌద్ధ చరిత్ర పరిశోధనల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది.