తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. పలువురు మృతి!

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు మృతి చెందారు.

Published on: Jan 4, 2026, 21:37:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు మృతి చెందారు. యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

రోడ్డు ప్రమాదాలు
రోడ్డు ప్రమాదాలు

మృతులను యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన బొల్లా దీక్షిత్ (21), కొక్కల సాయి (20)గా గుర్తించారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో మోత్కూరు నుండి వలిగొండ వైపు యువకులు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మరణించారు. లారీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలో రోడ్డు ప్రమాదాలు

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోంపేట మండలం బారువ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. లారీ, కారు డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే క్రమంలో లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఘటన స్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో గాయపడిన ఇద్దరు.. చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి.. మరణించారు. మృతులు ఒడిశా వాసులుగా తెలుస్తోంది.

విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం ఘాట్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. పద్మనాభం ఆలయాన్ని సందర్శించి కుటుంబం తిరిగి వస్తుండగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్లను ఢీకొట్టి దాదాపు 20 మీటర్ల దూరంలో పడింది.

మృతుడిని గంటి వీవీఎస్ ప్రసాద్ గా గుర్తించామని పద్మనాభం సీఐ శ్రీధర్ తెలిపారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘాట్ రోడ్డు చివరి మలుపు వద్ద కారు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని సీఐ తెలిపారు. వాహనంలో ప్రయాణిస్తున్న వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More