...
...
Next Story

Indiramma Family Insurance : రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ బీమా స్కీమ్.. ఇదిగో గైడ్‌లైన్స్!

Indiramma Family Insurance : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రేషన్ కార్డు లేనివారికి కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రూ. 5 లక్షల బీమాకు అర్హతలు, వయోపరిమితి, కావాల్సిన పత్రాలు, నామినీ రూల్స్ తెలుసుకోండి.

Updated on: Nov 23, 2026, 06:46:36 IST
Advertisement

రాష్ట్రంలోని పేద, బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Kutumba Jeevitha Bima Scheme) అమలు చేస్తోంది. ఈ పథకం విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రణాళికా శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడే నిరుపేద కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

ఇందిరమ్మ ఫ్యామిలీ బీమా
ఇందిరమ్మ ఫ్యామిలీ బీమా

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల స్థాయిలో నెల రోజుల పాటు ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ పథకంలో లబ్ధిదారుడిగా నమోదు కావడానికి ప్రభుత్వం స్పష్టమైన వయోపరిమితిని నిర్దేశించింది. అయితే రేషన్ కార్డు లేనివారికి కూడా ఈ స్కీమ్ వర్తింపజేయనున్నారు.

దరఖాస్తు చేసుకునే నాటికి లబ్ధిదారుడి వయసు 18 ఏళ్ల నుండి 59 ఏళ్ల మధ్య ఉండాలి. (అంటే 1967 నవంబర్ 19 నుండి 2008 నవంబర్ 18 మధ్య జన్మించిన వారంతా అర్హులే). వయసు లెక్కింపునకు ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. ఒకవేళ ఆధార్‌లో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే, ఆ సంవత్సరం జులై 1వ తేదీని పుట్టిన తేదీగా పరిగణిస్తారు. ఆధార్‌లో వివరాలు తప్పుగా ఉంటే, మీ-సేవ లేదా ఆధార్ కేంద్రంలో అప్‌డేట్ చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి.

పాలసీ మొదలైన తర్వాత, ఆ బీమా సంవత్సరంలో లబ్ధిదారుడికి 60 ఏళ్లు నిండినా, ఆ ఏడాది ముగిసే వరకు బీమా రక్షణ యథాతథంగా కొనసాగుతుంది. ఒక రేషన్ కార్డుపై కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది. రేషన్ కార్డు నంబరునే దరఖాస్తు నంబరుగా పరిగణిస్తారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్ నంబర్ ఓటీపీ, రసీదు కోసం కావాలి. రేషన్ కార్డు e-KYC పెండింగ్‌లో ఉన్నవారు వెంటనే సమీపంలోని రేషన్ దుకాణంలో దానిని పూర్తి చేసుకోవాలి.

నామినీలుగా 18 ఏళ్ల లోపు పిల్లలు (మైనర్లు) ఉంటే.. వారి తరఫున బీమా సొమ్మును స్వీకరించేందుకు ఒక మేజర్ వ్యక్తిని అపాయింటీగా తప్పనిసరిగా నియమించాలి. ఈ అపాయింటీ కుటుంబ సభ్యుడే కావాల్సిన అవసరం లేదు, నమ్మకస్తులైన ఎవరినైనా పెట్టుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, పట్టణాల్లో వార్డు ఆఫీసుల్లో నెల రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. క్యాంపుల తేదీలను ముందుగానే గ్రామాలలో చాటింపు ద్వారా ప్రజలకు తెలియజేస్తారు.

ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లిన వారు తమ సొంత ఊరికి వెళ్లాల్సిన పనిలేదు. వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలోని క్యాంపులోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడి అధికారులు వివరాలను సేకరించి, ఆన్‌లైన్ ద్వారా వారి స్వస్థల జిల్లాల అధికారులకు పరిశీలన నిమిత్తం పంపిస్తారు. నమోదు పూర్తవ్వగానే లబ్ధిదారుడి ఫోన్‌కు ఐడీ నంబర్‌తో కూడిన ఎస్ఎంఎస్ రసీదు వస్తుంది.

సాంకేతిక లోపాలు, పేర్లలో అక్షర దోషాలు లేదా పత్రాల్లో చిన్నపాటి తేడాలు ఉన్నాయన్న కారణంతో ఏ ఒక్క పేదవాడిని క్యాంపుల నుండి వెనక్కి పంపకూడదని ప్రభుత్వం అధికారులను గట్టిగా హెచ్చరించింది. ప్రతి శిబిరంలో ఒక ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి, ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి. క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ప్రతిరోజూ జిల్లా స్థాయి సమీక్షా సమావేశాల్లో చర్చించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks