తెలంగాణ అన్నదాతలకు శుభవార్త - రేపే రైతు భరోసా నిధుల విడుదల, కొత్త వారికి కూడా ఛాన్స్..!
Telangana Rythu Bharosa Updates : వానాకాలం పంట పెట్టుబడి సాయానికి రంగం సిద్ధమైంది. జూన్ 30న మధిర నియోజకవర్గంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు జులై 5 వరకు గడువు ఇచ్చారు.
Telangana Rythu Bharosa Updates : రైతు భరోసా నిధులు విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ పథకం కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి సీజన్‌కు ఎకరానికి రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. ఈ వానాకాలం సీజన్ కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని జూన్ 30వ తేదీన ప్రభుత్వం విడుదల చేయనుంది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, మత్కేపల్లి గ్రామం వద్ద జూన్ 30వ తేదీన (మంగళవారం) ప్రభుత్వం భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఈ ప్రతిష్టాత్మక సభా వేదిక నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి బటన్ నొక్కి ఒకేసారి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ భారీ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ.9,000 కోట్ల నిధులను సేకరించినట్లు తెలిసింది.
గతంలోనే మాదిరిగానే చిన్న కమతాల నుంచి పెద్ద కమతాల వారికి నిధులను జమ చేస్తారు. వరుసగా 8 నుంచి 9 రోజుల పాటు విడతల వారీగా ఈ నిధుల బదిలీ ప్రక్రియ కొనసాగుతుంది.
గుంట నుంచి ఒక ఎకరం వరకు భూ విస్తీర్ణం కలిగి ఉన్న పట్టాదారు రైతుల ఖాతాల్లో మొదటగా డబ్బులు జమ అవుతాయి. దీనికోసం సుమారు రూ.900 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల కోసం రూ.2,400 కోట్లు అవసరమని లెక్కగట్టారు. ఆ తర్వాత రోజుల్లో గరిష్టంగా పది ఎకరాల లోపు ఉన్న రైతుల వరకు ఈ 9 రోజుల్లో నిధులు పూర్తిగా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త రైతులకు ఛాన్స్…!
మరోవైపు రాష్ట్రంలోని కొత్త పట్టాదారులకు వ్యవసాయశాఖ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 15వ తేదీ వరకు కొత్తగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులందరూ రైతు భరోసా పథకానికి అర్హులని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్తగా పాస్‌పుస్తకాలు అందుకున్న రైతులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది.
కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)ని లేదా మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో)ని కలిసి తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. పాస్‌పుస్తకం ప్రతి, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో అధికారులను సంప్రదించి, గడువు(జూలై 5) ముగిసేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కోరింది. కొత్త రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఏఏ పత్రాలు ఉండాలి..?
- పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
- రైతు ఆధార్ కార్డుతో పాటు రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో పాటు సమర్పించాలి.
- అప్లికేషన్ ఫారంలో పూర్తి వివరాలు నింపి రైతు వేదికల వద్ద లేదా మండలాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి.
రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ఈ మొత్తం రెండు దఫాలుగా ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి విడతలో రూ. 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఖరీఫ్, రబీ సీజన్ ల కోసం రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

