Telangana New CS : తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్!

New Telangana CS Sanjay Jaju : రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Jun 26, 2026, 15:15:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

New Telangana CS Sanjay Jaju : తెలంగాణ రాష్ట్ర పరిపాలనారంగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామకృష్ణారావు పదవీ కాలం ముగియనుండటంతో…. ఆయన స్థానంలో సంజయ్ జాజును ఎంపిక చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

సంజయ్ జాజు
సంజయ్ జాజు

సంజయ్ జాజు 1992 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. ఇప్పటివరకు కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలను రాష్ట్రానికి కేటాయించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రత్యేకంగా అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ … ఆయనను తిరిగి సొంత కేడర్‌కు పంపేందుకు తక్షణమే ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.

సంజయ్‌ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ సబ్‌కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా పని చేశారు. అంతేకాకుండా హైదరాబాద్‌ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు.

ఈనెలతో ముగియనున్న గడువు…

ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పొడిగించిన పదవీ కాలం జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర తదుపరి సీఎస్ ఎవరనే దానిపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ సాగుతోంది. రామకృష్ణారావు పదవీ విరమణ సమయం దగ్గర పడటంతో, పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా అనుభవజ్ఞుడైన సంజయ్ జాజును రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

సంజయ్ జాజుకు కేంద్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ శాఖల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ ఏడాది మార్చిలోనే ఆయనను ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అంతకుముందు ఆయన కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా కూడా సేవలందించారు. సంజయ్‌జాజు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉండనున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More