Telangana New CS : తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు…? బదిలీ చేసిన కేంద్రం

Telangana New CS : కేంద్ర సర్వీసుల్లో ఉన్న 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బదిలీ చేసింది. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ కాలం ముగియనుండటంతో… జాజును కొత్త సీఎస్‌గా నియమించే అవకాశం ఉంది.

Published on: Jun 24, 2026, 13:25:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వ పరిపాలనా విభాగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర సర్వీసుల్లో డెప్యుటేషన్‌పై ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును కేంద్ర ప్రభుత్వం తిరిగి సొంత కేడర్ అయిన తెలంగాణకు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఢిల్లీతో పాటు హైదరాబాద్ సచివాలయ వర్గాలు వెల్లడించాయి.

ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు
ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు

సంజయ్ జాజు 1992 బ్యాచ్‌కు చెందిన భారత పరిపాలనా సేవా (IAS) అధికారి. ప్రస్తుతం ఆయన కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవలను రాష్ట్రానికి కేటాయించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రత్యేకంగా అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ … ఆయనను తిరిగి సొంత కేడర్‌కు పంపేందుకు తక్షణమే ఆమోదం తెలిపింది.

సంజయ్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ సబ్‌కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా పని చేశారు. అంతేకాకుండా హైదరాబాద్‌ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు. జాజును సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఉత్తర్వులు జారీ అయితే….. ఆయన 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉంటారు.

ఈనెలతో ముగియనున్న గడువు…

ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పొడిగించిన పదవీ కాలం జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర తదుపరి సీఎస్ ఎవరనే దానిపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ సాగుతోంది. రామకృష్ణారావు పదవీ విరమణ సమయం దగ్గర పడటంతో, పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా అనుభవజ్ఞుడైన సంజయ్ జాజును రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

సంజయ్ జాజుకు కేంద్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ శాఖల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ ఏడాది మార్చిలోనే ఆయనను ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అంతకుముందు ఆయన కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా కూడా సేవలందించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More