సింగరేణి చరిత్రలో మరో మైలురాయి.. ఒడిశా నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన బొగ్గు రైలు!

సింగరేణిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒడిశా నైనీ గని నుంచి తెలంగాణకు తొలి బొగ్గు రైలు చేరింది.

Updated on: Aug 6, 2026, 12:05:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఒడిశాలోని సింగరేణికి చెందిన నైనీ బొగ్గు గని నుంచి మొదటి బొగ్గు రైల్వే వ్యాగన్ విజయవంతంగా తెలంగాణకు చేరుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (STPP) ఈ బొగ్గు రైలు చేరుకోగా, సింగరేణి అధికారులు, ఉద్యోగులు పూజలు నిర్వహించి ఘన స్వాగతం పలికారు.

బొగ్గు
బొగ్గు

ఈ మైలురాయిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేస్తూ.. సింగరేణి యాజమాన్యానికి, కార్మికులకు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇది సింగరేణి విస్తరణ, ఉత్పత్తి పెంపుదల చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని ఆయన పేర్కొన్నారు.

తొలి విడతగా ఒడిశాలోని నైనీ గని నుంచి 59 వ్యాగన్ల ద్వారా సుమారు 4,000 టన్నుల జీ-10 గ్రేడ్ బొగ్గును రైలు మార్గంలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు తరలించారు. ఈ బొగ్గు లభ్యతతో జైపూర్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు కొరత తీరడంతో పాటు రవాణా వ్యయం కూడా తగ్గనుంది.

మరోవైపు నైనీ గని నుంచి బొగ్గు ఉత్పత్తి, రవాణా అనుకున్న లక్ష్యాల ప్రకారం నిరంతరాయంగా సాగేలా చూసేందుకు సింగరేణి ఉన్నతాధికారులు మంగళవారం ఒడిశాలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) గౌతమ్ పొత్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న అధ్యక్షతన ఈ భేటీ జరిగింది.

ఈ సమావేశంలో జిందాల్ స్టీల్, జిందాల్ ఇండియా పవర్ లిమిటెడ్, మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్, తమిళనాడు పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి ప్రధాన వినియోగదారుల ప్రతినిధులతో పాటు బొగ్గు రవాణా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

సమావేశంలో డైరెక్టర్ గౌతమ్ పొత్రు మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు. నైనీ బొగ్గు గని నుంచి ప్రతిఏటా 6 మిలియన్ టన్నుల (60 లక్షల టన్నులు) బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గును సమీపంలోని పవర్ ప్లాంట్‌లతో పాటు తెలంగాణలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు, అలాగే తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్లకు నిరంతరాయంగా సరఫరా చేస్తామన్నారు.

స్థానిక వినియోగదారులకు, రైల్వే సైడింగ్‌లకు అనుకున్న లక్ష్యాల మేరకు నిత్యం బొగ్గు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని రవాణా ఏజెన్సీలను ఆయన కోరారు. రైలు మార్గం ద్వారా వేగవంతమైన రవాణాను సులభతరం చేసేందుకు సమీపంలోని హిందోల్, కామాఖ్య నగర్ సైడింగ్‌లకు ప్రాధాన్యతా క్రమంలో సకాలంలో బొగ్గును చేర్చాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. వెంకన్న స్పష్టం చేశారు. నైనీ గని నుండి రోజుకు కనీసం 12,000 టన్నుల బొగ్గును రవాణా చేసేలా సింగరేణి యాజమాన్యం పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తోంది.

ఒడిశా నైనీ గని పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం వల్ల తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా మరింత బలోపేతం కానుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More