Vijay NEET: విజయ్ సంచలన ట్వీట్.. దీనికి అదొక్కటే పరిష్కారం అంటూ మౌనం వీడిన తమిళనాడు సీఎం

Vijay NEET: ఢిల్లీలో జరుగుతున్న నీట్ నిరసనలపై మొత్తానికి తమిళనాడు సీఎం విజయ్ స్పందించారు. అసలు ఆ నీట్ మొత్తాన్ని రద్దు చేయడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారం అని ఆయన అనడం గమనార్హం. చాలా రోజులుగా విజయ్ దీనిపై స్పందించకపోవడంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

Published on: Jul 22, 2026, 16:24:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vijay NEET: నీట్ (NEET) పరీక్షల లీకేజీ, నిర్వహణ లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్ సంచలన రీతిలో స్పందించారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఎక్స్ వేదికగా వేడివేడి వ్యాఖ్యలతో సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.

Vijay NEET: విజయ్ సంచలన ట్వీట్.. దీనికి అదొక్కటే పరిష్కారం అంటూ మౌనం వీడిన తమిళనాడు సీఎం
Vijay NEET: విజయ్ సంచలన ట్వీట్.. దీనికి అదొక్కటే పరిష్కారం అంటూ మౌనం వీడిన తమిళనాడు సీఎం

విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న నీట్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలను అరెస్ట్ చేయడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని విజయ్ ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వెంటనే విద్యార్థులు, ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించి నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

"నీట్ రద్దే ఏకైక పరిష్కారం!" - విజయ్ స్ట్రాంగ్ కౌంటర్

ఎన్నికల ప్రచార సమయం నుంచి నీట్ రద్దుపై స్పష్టమైన వైఖరితో ఉన్న తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ.. ఇప్పుడు కూడా అదే మాటపై కట్టుబడి ఉందని విజయ్ స్పష్టం చేశారు. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం తాము అబద్ధపు హామీలు ఇవ్వమని, లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలను నాశనం చేస్తున్న నీట్ వ్యవస్థను శాశ్వతంగా బ్యాన్ చేయడమే ఏకైక పరిష్కారమని తేల్చి చెప్పారు.

విద్యా రంగాన్ని రాజ్యాంగంలోని కాన్‌కరెంట్ లిస్ట్ నుంచి స్టేట్ లిస్ట్‌కు మార్చడం ద్వారానే రాష్ట్రాలకు పూర్తి అధికారాలు దక్కుతాయని విజయ్ ప్రతిపాదించారు. ఒకవేళ అందులో ఏవైనా చట్టపరమైన ఇబ్బందులు ఉంటే, తాత్కాలికంగా 'స్పెషల్ కాన్‌కరెంట్ లిస్ట్' తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు మెడికల్ అడ్మిషన్ల నిర్వహణపై పూర్తి హక్కులు ఇవ్వాలని సూచించారు.

ఢిల్లీ వేదికగా విద్యార్థుల నిరసనలు

ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న వేళ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP), సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ నేతృత్వంలో విద్యార్థులు 'చలో సంసద్' మార్చ్ చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు.

ఈ క్రమంలో శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రధాని నివాసం ఎదుట నిరసన తెలిపిన రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

విద్యార్థుల పోరాటానికి సెలబ్రిటీల ఫుల్ సపోర్ట్

ఢిల్లీలో జరుగుతున్న ఈ సుదీర్ఘ పోరాటానికి దేశవ్యాప్తంగా సినీ, సంగీత రంగానికి చెందిన ప్రముఖులు భారీగా మద్దతు ఇస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ నటి షబానా అజ్మీ, పాపులర్ రేపర్ హనుమాన్‌కైండ్ స్వయంగా ఢిల్లీ ప్రొటెస్ట్‌లో పాల్గొని విద్యార్థుల పక్షాన నిలబడ్డారు.

ముంబైలో గుర్‌ఫతే పిర్జాదా, ప్రతిభా రాంతా, శాలిని పాండే, ఆకాస సింగ్ నిరసనల్లో పాల్గొనగా, చెన్నైలో తమిళ రేపర్ 'తెరుక్కురల్' అరివు సెక్రటేరియట్ వద్ద ఆందోళన చేపట్టి పోలీసుల అరెస్ట్‌కు గురయ్యారు. ఇటు దక్షిణాది అగ్రనటుడిగా, అటు ముఖ్యమంత్రిగా విజయ్ నేరుగా రంగంలోకి దిగి పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించడంతో ఈ నీట్ వ్యతిరేక ఉద్యమం మరింత పవర్‌ఫుల్‌గా మారింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More