IPS Transfers in Telangana : పోలీస్ శాఖలో కీలక బదిలీలు జరిగాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ బదిలీలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖాగోయల్‌ను ప్రభుత్వం కీలకమైన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ప్రస్తుతం ఆమె విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హోం సెక్రటరీగా బాధ్యతలు చేపట్టినప్పటికీ….. ఆమె తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను కూడా కొనసాగిస్తారు.
శిఖాగోయల్ స్థానంలో దేవేంద్ర సింగ్ చౌహాన్ (1997 బ్యాచ్) విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. అంతేకాకుండా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఆయన వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఆయన ఏడీజీ (పర్సనల్)గా పనిచేస్తున్నారు.
ఫ్యూచర్ సిటీ సీపీగా తరుణ్ జోషి
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న 'ఫ్యూచర్ సిటీ'కి పోలీస్ కమిషనర్‌గా తరుణ్ జోషిని (2004 బ్యాచ్) నియమించారు. ప్రస్తుతం ఆయన ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రస్తుత సీపీ జి. సుధీర్ బాబు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.
- మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా ఉన్న అవినాష్ మొహంతిని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా బదిలీ చేశారు. ఆయన ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ డైరెక్టర్ బాధ్యతలతో పాటు ఏసీబీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు.
- ఐజీపీ (ఇంటెలిజెన్స్)గా ఉన్న బి. సుమతిని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
- డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న షా నవాజ్ ఖాసింను మల్టీ-జోన్-II ఐజీపీగా బదిలీ చేశారు. ఆయన ఐజీపీ (పర్సనల్)గా అదనపు బాధ్యతలు చూస్తారు.
- ఇంటెలిజెన్స్ ఐజీపీగా ఉన్న కార్తికేయకు అదనంగా ఐజీపీ (SIB) బాధ్యతలు నిర్వర్తిస్తారు.