డీలిమిటేషన్ బిల్లు : రేపు ఢిల్లీలో 'దక్షిణాది' కాంగ్రెస్ సీఎంల భేటీ - చర్చల తర్వాత నిర్ణయం..!

సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై నవంబర్ 29న ఢిల్లీలో తెలంగాణ, కేరళ సీఎంలతో భేటీ అవుతానని డీకే శివకుమార్ తెలిపారు. దక్షిణాది ప్రయోజనాలపై చర్చించి తమ వైఖరిని స్పష్టం చేస్తామన్నారు.

Published on: Nov 28, 2026, 12:56:54 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

లోక్‌సభ, శాసనసభ సీట్లను 50 శాతం పెంచే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చించేందుకు నవంబర్ 29న ఢిల్లీలో తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు, ప్రతిపాదిత సీట్ల పెంపు వల్ల దక్షిణాది రాష్ట్రాలపై పడే ప్రభావంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తామని చెప్పారు. పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యం, రాజకీయ బలంపై ఈ మార్పులు చూపే పరిణామాలను విశ్లేషిస్తామని వివరించారు.

సీఎం రేవంత్ - డీకే శివ కుమార్ (ఫైల్ ఫొటో)
సీఎం రేవంత్ - డీకే శివ కుమార్ (ఫైల్ ఫొటో)

లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు

ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో లోక్‌సభ సీట్ల కేటాయింపు, శాసనసభల బలాన్ని 50 శాతం పెంచి, మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్రం కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. సోమవారం లోక్‌సభ ముందుకు రానున్న రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు, 2026 ద్వారా లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో రాష్ట్రాల నుంచి గరిష్ఠంగా 815 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది సభ్యులు ఉండేలా ప్రతిపాదించారు. అలాగే రాష్ట్ర శాసనసభల గరిష్ఠ పరిమితిని 500 నుంచి 650కి పెంచే ప్రతిపాదన కూడా ఇందులో ఉంది.

దక్షిణాది ప్రయోజనాలు.. జనాభా ప్రభావంపై చర్చ

"నేను ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్తున్నాను. రేపు తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రులు, నేను కలిసి ఈ అంశంపై చర్చిస్తాం. మన రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం, మన జనాభా సంఖ్య వల్ల కలిగే ప్రభావాలు, దక్షిణాదితో పాటు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో పరిశీలిస్తాం," అని విలేకరులతో మాట్లాడుతూ డీకే శివకుమార్ తెలిపారు. ప్రతిపాదనలోని లాభనష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు.

కేంద్ర మంత్రివర్గం నిన్ననే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని, ఇప్పటివరకు మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే తమకు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గ నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తమకు తెలియవని… చర్చల అనంతరం ఏం చేయాలి, ఈ అంశాన్ని ఎంత బలంగా లేవనెత్తాలి అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. దక్షిణాది రాష్ట్రాలు సమష్టిగా తమ ప్రయోజనాలను కాపాడుకోవాలని, ప్రాతినిధ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని డీకే శివకుమార్ నొక్కి చెప్పారు.

మహిళా రిజర్వేషన్.. సీట్ల పెంపుపై వైఖరి

"మహిళా రిజర్వేషన్ల విషయంలో మనమందరం ఏకీభవించాం. మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కానీ సీట్ల పెంపు విషయానికి వస్తే, రేపటి సమావేశం తర్వాత మా పార్టీ వైఖరిని మీకు తెలియజేస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ఆందోళనలపై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశంలో తాను పాల్గొన్న విషయాన్ని శివకుమార్ గుర్తుచేశారు. సోమవారం నుంచి ప్రతిపాదిత చట్టంపై ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, నవంబర్ 29న ఢిల్లీలో చర్చల కోసం కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ పార్టీలను ఆహ్వానించిందని తెలిపారు.

"దేశవ్యాప్తంగా తమకు ఏది అనుకూలమో బీజేపీ ఆ దిశగా చూస్తోంది. మనం దక్షిణాది ప్రయోజనాలను కాపాడాలి, పార్లమెంటులో మన ప్రాతినిధ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఈ అంశాలన్నింటినీ కలిసి చర్చిస్తాం," అని ఆయన అన్నారు. న్యాయబద్ధమైన డీలిమిటేషన్ జరగాలంటూ దక్షిణాది రాష్ట్రాలు గతంలో చేసిన డిమాండ్ నేపథ్యంలో, దీనిపై కాంగ్రెస్ వైఖరి ఏమిటని ప్రశ్నించగా.. ఆదివారం జరిగే సమావేశం తర్వాత పార్టీ వైఖరిని స్పష్టం చేస్తామని చెప్పారు.

"రేపు ఢిల్లీలో సమావేశమవుతున్నాం. భేటీ తర్వాత మా పార్టీ వైఖరి ఏంటో చెబుతాను. అసలు వివరాలు తెలియకుండా ఇప్పుడే వ్యాఖ్యానించలేను. మీడియాలో వస్తున్న సమాచారం ఆధారంగానే మాట్లాడుతున్నాం. ఇతర ముఖ్యమంత్రులను కలిసిన తర్వాత మీ ముందుకొస్తాను," అని డీకే శివకుమార్ వివరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.