ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రజలకు సింగరేణి ప్యాసింజర్(ప్రస్తుతం సింగరేణి ఎక్స్‌ప్రెస్) కేవలం ఒక రైలు మాత్రమే కాదు.. అదొక సజీవ జ్ఞాపకం, వేలాది కుటుంబాల జీవననాడి. నల్లబంగారు నేలలో నిరంతరం శ్రమించే బొగ్గు గని కార్మికుల చెమట చుక్కలకు, పల్లెటూరి రైతుల ఆశలకు, విద్యార్థుల భవిష్యత్తు కలలకు ఐదు దశాబ్దాలుగా వారధిగా నిలిచిన ఈ ఐకానిక్ రైలు విజయవంతంగా 50 వసంతాలు పూర్తిచేసుకుంది.

1960ల కాలంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) రామగుండం, బెల్లంపల్లి, మందమర్రి ప్రాంతాల్లో బొగ్గు గనుల తవ్వకాలను విస్తృతంగా ప్రారంభించింది. దీంతో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచి వేలాది మంది గ్రామీణ యువకులు, కార్మికులు ఉపాధి కోసం ఈ బొగ్గు గని ప్రాంతాలకు వలస వచ్చారు.
అప్పట్లో రవాణా సౌకర్యాలు చాలా పరిమితంగా ఉండేవి అన్న విషయం తెలిసిందే. దక్షణాదిని, ఉత్తరాదిని కలిపే ప్రధాన రైల్వే లైన్ ఈ జిల్లాల గుండా వెళ్లినప్పటికీ, కార్మికులు నివసించే చిన్న చిన్న స్టేషన్లలో రైళ్లకు హాల్టింగ్ ఉండేది కాదు. దీంతో గనులకు, విధులకు వెళ్లడానికి కార్మికులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ రవాణా కష్టాలను తీర్చేందుకు రైల్వే శాఖ ప్రత్యేకంగా ఒక రైలును అందుబాటులోకి తెచ్చింది. సింగరేణి సంస్థ పేరు మీదుగా దీనికి సింగరేణి ప్యాసింజర్ అని నామకరణం చేశారు.
1976 సెప్టెంబర్ 2న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈ చారిత్రాత్మక రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభంలో ఈ రైలు బెల్లంపల్లి నుంచి కొత్తగూడెం (భద్రాచలం రోడ్) మధ్య నడిచేది. కాలక్రమేణా ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను బట్టి దీని సేవలను సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు పొడిగించారు. సింగరేణి ప్రధాన కార్యాలయం ఉన్న కొత్తగూడెం వెళ్లాలన్నా, అక్కడ ఉన్న సింగరేణి ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు పొందాలన్నా కార్మికులకు ఇదే ఏకైక దిక్కు.
అంతేకాదు ఉప్పుల, జమ్మికుంట, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, కొత్తపల్లి ప్రాంతాల నుంచి వందలాది మంది పాడి రైతులు రోజూ ఉదయమే పాలు, కూరగాయల క్యాన్లతో ఈ రైలు ఎక్కేవారు. మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి కార్మిక పరిశ్రమల ప్రాంతాలకు పాలు, నిత్యావసరాలు చేరవేసి తమ జీవనోపాధి పొందేందుకు ఈ రైలు జీవనధారగా మారింది.
{{/usCountry}}అంతేకాదు ఉప్పుల, జమ్మికుంట, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, కొత్తపల్లి ప్రాంతాల నుంచి వందలాది మంది పాడి రైతులు రోజూ ఉదయమే పాలు, కూరగాయల క్యాన్లతో ఈ రైలు ఎక్కేవారు. మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి కార్మిక పరిశ్రమల ప్రాంతాలకు పాలు, నిత్యావసరాలు చేరవేసి తమ జీవనోపాధి పొందేందుకు ఈ రైలు జీవనధారగా మారింది.
{{/usCountry}}కొత్తగూడెంలోని సింగరేణి కాలేజీలో చదివే పేద విద్యార్థులకు, రామగుండం-వరంగల్ పరిసరాల్లోని విద్యాసంస్థలకు వెళ్లే యువతకు ఇది తక్కువ ఖర్చుతో కూడిన సురక్షిత ప్రయాణ సాధనంగా నిలిచింది. సింగరేణి ట్రైన్ స్టేషన్‌కు వస్తుంది అంటే ఉత్తర తెలంగాణ జనాల్లో ఒక ఎమోషన్ ఉండేది.
నాటి ఆవిరి ఇంజన్ (స్టేషన్లలో బొగ్గు పొగ చిమ్ముతూ) కాలం నుంచి నేటి ఎలక్ట్రిక్ ట్రాక్షన్ వరకు సింగరేణి రైలు రూపాంతరం చెందింది. ప్యాసింజర్‌గా ప్రారంభమై నేడు సింగరేణి ఎక్స్‌ప్రెస్ రూపంలో సేవలు అందిస్తోంది. ఎన్ని ఆధునిక వందే భారత్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు వచ్చినా.. తెలంగాణ పల్లె ప్రజలు, బొగ్గు గని కుటుంబాల గుండెల్లో సింగరేణి బండికి ఉన్న స్థానం ప్రత్యేకం. ఈ విషయాన్ని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రజలు అస్సలు మరిచిపోలేరు.