...
...
Next Story

తెలంగాణలో SIR సర్వే.. మిమ్మల్ని ఏం అడుగుతారు? మీకు ఉన్న ప్రశ్నలు-సమాధానాలు!

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) జూన్ 25వ తేదీన మెుదలుకానుంది. అయితే దీనిపై చాలా మందికి పలు ప్రశ్నలు ఉన్నాయి. వాటికి ఇక్కడ సమాధానాలు అందించం చూడండి.

Published on: Jun 21, 2026, 16:48:46 IST
Advertisement

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియ ప్రస్తుతం ఓటర్లలో తీవ్ర ఆసక్తిని, అదే సమయంలో కొన్ని సందేహాలను రేకెత్తిస్తోంది. ప్రస్తుత ఓటరు వివరాలను 2002 నాటి ఓటర్ల జాబితాతో లింక్ చేయడం, డిక్లరేషన్లు సమర్పించడం, కొన్ని సందర్భాల్లో సహాయక పత్రాలను అందించడం వంటివి ఈ ప్రక్రియలో భాగం. అసలు ఈ సవరణ ఎందుకు చేస్తున్నారు? రాజకీయ పార్టీల అభ్యంతరాలు ఏమిటి? వంటి పలు అంశాలపై తరచూ అడిగే ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంటే ఏమిటి?

ఎన్నికల సంఘం
ఎన్నికల సంఘం

భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను నవీకరించడానికి (Update), తప్పులను సవరించడానికి చేపట్టిన ప్రత్యేక ప్రక్రియే ఈ SIR. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం.. 1951 నుండి 2004 వరకు దేశంలో ఎనిమిది సార్లు ఈ ప్రక్రియ నిర్వహించారు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో చివరిసారిగా 2002లో ఈ ప్రత్యేక సవరణ జరిగింది. గతంలో ప్రతిసారీ ఓటర్ల డేటాను మొదటి నుండి సేకరించేవారు, కానీ 2002 నుండి ఈ ప్రక్రియను ఆధునీకరించి, ఉన్న డేటాకు మార్పులు-చేర్పులు చేస్తున్నారు.

ఈ సవరణ ఎందుకు అవసరం?

ప్రజాస్వామ్య ప్రక్రియ పవిత్రతను కాపాడటానికి ఓటర్ల జాబితాను సవరణ చేయడం అత్యంత ఆవశ్యకం. ఒకే ఓటరు పేరు రెండు చోట్ల ఉండటం (Duplication), మరణించిన ఓటర్ల పేర్లను తొలగించడం, ప్రస్తుత వివరాలలో తప్పులను సరిదిద్దడం కోసం ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా జరిగే 'ప్రత్యేక సంక్షిప్త సవరణ' (SSR)తో పోలిస్తే, ఈ SIR లో అధికారులు ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లడం దీని ప్రత్యేకత.

ఈ సవరణ ప్రక్రియ ఎలా జరుగుతుంది?

ప్రతి పోలింగ్ కేంద్రానికి నియమించిన బూత్ స్థాయి అధికారులు (BLOs) ముందే ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారాలతో ఓటర్ల ఇంటి వద్దకు వస్తారు.

ఓటర్లు ‘https://voters.eci.gov.in’ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఫారమ్‌ను నింపవచ్చు. అయితే దీని కోసం ఓటరు పేరు ఆధార్ కార్డులోని పేరుతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది.

నోటీసుల జారీ చేస్తారా?

ఇంటింటి ఫారాల సేకరణ పూర్తయిన తర్వాత, జూలై 31న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురిస్తారు. ఆక్షేపణలు, క్లెయిమ్‌లు దాఖలు చేయడానికి ఆగస్టు 30 వరకు నెల రోజుల సమయం ఇస్తారు. తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 1న విడుదలవుతుంది.

వివరాలు మ్యాపింగ్ కాని వారికి లేదా తప్పులతో మ్యాపింగ్ అయిన ఓటర్లకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు నోటీసులు జారీ చేసి, విచారణ చేపడతారు. నోటీసులు అందుకున్న వారు తమ పౌరసత్వాన్ని నిరూపించే సంబంధిత పత్రాలతో నిర్ణీత సమయంలో ఈఆర్ఓను కలవాల్సి ఉంటుంది.

ప్రీ-ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ అంటే ఏమిటి?

పూర్తి స్థాయి సవరణకు ముందే.. 2002 నాటి ఎస్‌ఐఆర్ జాబితాలోని ఓటర్లను ప్రస్తుత జాబితాతో సరిపోల్చే ప్రక్రియే 'ప్రీ-మ్యాపింగ్'. ఇలా ముందే మ్యాపింగ్ పూర్తయి, వివరాలు సరిపోయిన ఓటర్లు ఈ సవరణ ప్రక్రియలో ఎలాంటి అదనపు పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు.

2002 జాబితాలో పేరును వెతకడం ఎలా?

ఓటర్లు తమ పేర్లను ‘https://ceotelangana.nic.in’ లేదా ‘https://voters.eci.gov.in’ లింకుల ద్వారా వెతకవచ్చు. ఓటరు పేరు లేదా బంధువుల పేరు ఆధారంగా శోధించవచ్చు. పోలింగ్ కేంద్రాల వారీగా పీడీఎఫ్ డేటా కూడా వెబ్‌సైట్‌లో ఉంది. ఇంటర్నెట్ లేని వారి కోసం బీఎల్ఓల వద్ద 2002 నాటి ప్రింటెడ్ కాపీ అందుబాటులో ఉంటుంది.

ఒకవేళ 2002 జాబితాలో మీ పేరు లేకపోతే?

అలాంటి వారు తమ తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల వివరాలను సేకరించి, వాటిని ఎన్యుమరేషన్ ఫారంలో పూరించాలి. ఈ వివరాలను తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అధికారిక వెబ్‌సైట్ (https://ceotelangana.nic.in) లో పేరు లేదా ఎపిక్ (EPIC) నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.

రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఏమిటి?

తప్పులు లేదా వ్యత్యాసాలు (Anomalies) ఉన్న ఓటర్ల కేటగిరీపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జాబితాలో తలెత్తిన కొన్ని విచిత్రమైన తప్పులను వారు ఉదాహరణలుగా చూపుతున్నారు. అవి ఏంటంటే..

కొందరు ఓటర్లకు ఆరుగురు పిల్లలు ఉన్నట్లు చూపించడం.

2002, 2025 ఓటర్ల జాబితాల మధ్య పేర్ల స్పెల్లింగ్స్‌లో తేడాలు ఉండటం.

తండ్రికి, బిడ్డకు మధ్య కేవలం 15 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉండటం.

తాతకు, మనవడికి/మనవరాలికి మధ్య 40 ఏళ్ల వయస్సు వ్యత్యాసం మాత్రమే ఉండటం.

పార్టీల డిమాండ్లు

ఓటరు గుర్తింపు కోసం డ్రైవింగ్ లైసెన్స్ వంటి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు పత్రాలను కూడా అనుమతించాలని పార్టీలు కోరుతున్నాయి. ఫారాలపై ఫోటోలు ముందే ముద్రించి వస్తాయా లేదా ఓటరే అంటించాలా అనేదానిపై స్పష్టత కోరారు. అలాగే తెలుగు చదవడం రాని వారి కోసం ఫారాలను ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఓటర్లకు ఎదురవుతున్న సవాళ్లు ఏమిటి?

తరచూ ఇళ్లు మారే అద్దెదారులు ఈ ప్రక్రియ విధానంపై తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు. చాలా మంది ఓటర్లు వెబ్‌సైట్‌లో పేర్లు వెతకడం కష్టంగా ఉందని చెబుతున్నారు. 2002 నాటి వివరాలను వెతికేటప్పుడు తాము ఏ నియోజకవర్గం, ఏ బూత్ నంబర్ పరిధిలో ఉన్నామో తమకు కానీ, తమ తల్లిదండ్రులకు కానీ గుర్తుకు రాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. 2002 జాబితాకు 2025 జాబితాకు మధ్య ఓటరు లేదా వారి తల్లిదండ్రుల పేర్ల స్పెల్లింగ్స్ మారడం సర్వసాధారణంగా మారింది. ఇలాంటి వారు కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలా లేదా 'ఫారం-8' ద్వారా తప్పుల సవరణ కోరాలా అనే గందరగోళం నెలకొంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe